స్వర్గ నరకాలు ఉన్నాయా?లేవా?
ఉంటే ఎక్కడ ఉన్నాయి ?అని అందరికి కలిగే ప్రశ్న. నరకంలో యమ భటులు నరక యాతలు పెడతారని చేసిన పాపాలకు శిక్షగా రంపంతో కొస్తారని, వేడి నూనెలో పాపులను వేయిస్తారని
గరుడ పురాణంలో చాలా మంది చదివి వుంటారు లేక విని వుంటారు. అయినా మానవులు పాపాలు చేస్తున్నారు. అంతే కాకుండా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి చేరుతామని సర్వభోగాలు అనుభవించవచ్చు అని పెద్దలు చెప్పింది విని ఉంటారు. అయినా పుణ్య కార్యాలు చేయడం లేదు.కానీ కొంతమంది చాలా దూరంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అది ఏమిటంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 23వ శ్లోకంలో కృష్ణుడు ఏమన్నాడు " నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః " ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు.
ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, గాలి ఆత్మను ఎండబెట్టలేదు, నీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.
అంటే ఆత్మకు దేహం ఉండదు.అలాంటప్పుడు ఆత్మకు శిక్షలు ఎలా అమలు చేస్తారు? దేహం లేనప్పుడు నరకయాతలు స్వర్గసుఖాలు ఎలా అనుభవిస్తారు? అని అనుమానం. ఈ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మన శాస్త్రాలు మనకు పదునాలుగు లోకాలు(dimensions) ఉన్నాయని వాటిలో ఒకటి పితృ లోకమని, చనిపోయిన తర్వాత దేహం నుండి జీవుడు విడివడిన తర్వాత ఆత్మ ఈ పితృ లోకానికి చేరుకుంటుంది అని చెబుతాయి.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దేహం ఉన్నపుడు ఎవరయినా కొట్టినా బాధపెట్టినా అనుభవం పొందేది దేహమా?మన మనసా? ఖచ్చితంగా అనుభవం పొందేది మన మనసు మాత్రమే. అంటే మన జ్ఞానేంద్రియాల వలన కలిగే సుఖం గాని, దుఃఖం గాని, బాధ గాని అనుభవించేది మనసు మాత్రమే. రాత్రి మనం నిద్రావస్థలో ఉన్నపుడు మన
మనసు ఒక స్వప్నపురుషుడిని సృష్టించుకుంటుంది అంటే ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. చెట్లు,పర్వతాలు,జంతువులు,
మనుషులు, అందమైన ప్రకృతి
అక్కడ మనం వున్నట్లుగా, మనసు వున్నట్లుగా,బుద్ధి వున్నట్లుగా,
ఇలా రకరకాల నామరూపాలు కలిగిన ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. ఆ స్వప్నంలో ఒక వ్యక్తి కత్తి తో దాడి చేసి గాయపరిస్తే రక్తం కారుతుంటే
నిద్రలో మనం ఎంతో ఆందోళన చెందుతాము.బాధ పడతాము.విలవిలా లాడిపోతాము. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్లతో ఆనందంగా గంతులు వేశాము సంతోషంగా ఉన్నాము.
స్వప్నంలో ఇవన్నీ అనుభవించింది ఎవరు? మన మనసు మాత్రమే. స్వప్నంలో అంతా యదార్థంగా జరిగినట్లుగా ఉంటుంది. కానీ మనం బాధ, సంతోషం అనుభవించేమా లేదా?
అనుభవం పొందేము. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ అనుభవాలు పొందింది ఎవరు అంటే మన మనసు. అంటే ఇది అనుభవక్షేత్రం. అలాగే దేహాన్ని విడిచిపెట్టిన జీవుడు పితృలోకానికి చేరిన తర్వాత సంచిత కర్మలలో పక్వానికి వచ్చిన కర్మలను బట్టి ఆనందాన్ని, దుఃఖాన్ని పొందుతాడు. 'కర్మ సిద్ధాంతాన్ని' చదివితే ఎన్ని రకాల కర్మలు ఉన్నాయో అవి మన వెంట ఎలా ప్రయనిస్తాయో తెలుస్తుంది. గరుడ పురాణంలో వివరించిన శిక్షలు అన్నీ బాాధ యొక్క తీవ్రత ఎలా ఉంటుందో అమలు చేసిన శిక్షల రూపంలో తెలిపారు. కాబట్టి స్వర్గానరకాలు ఉన్నాయి కానీ అవి 'అనుభవక్షేత్రం' మాత్రమే.
0 కామెంట్‌లు