తపస్సు చేస్తే దేవేంద్రుడు రంభ,ఉర్వశిలను పంపుతాడా?
********************************************
పూర్వకాలంలో మునీశ్వరులు, యోగులు,ఋషులు, అసురులు తపస్సు చేసినట్లయితే దేవేంద్రుడు రంభ ఊర్వశిలను అప్సరసలను పంపి వారి తపస్సును భగ్నం చేసేవాడు. ఇది పురాణాలలో సినిమాలలో కనిపించే కధ. తపస్సు అంటే ఏమిటి? ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుడిని ధ్యానించడం. ఋషులు గాని మనంగాని తపస్సు చేస్తే ఇంద్రుడు తపస్సును ఎందుకు భగ్నం చేస్తాడు? మన కోసం మనం భగవంతుడిని ద్యానిస్తే ఇంద్రునికి ఏమిటి నష్టం? మన తపస్సు ఎందుకు భగ్నం చేస్తాడు? కొంతమంది అంటారు ఆయన పదవికి ముప్పు కలుగుతుందని అంటారు. తపస్సు దేనికి చేస్తున్నారో ఆయనకి తెలియదా? మరి దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి? మనం ఏకాగ్ర చిత్తంతో ద్యానవస్తువు (భగవంతుడు) ఏదైతే ఉందొ దానిమీద ధ్యానం చేసినపుడు ఎన్నో జన్మల నుంచి అంటి పెట్టుకుని ఉన్న వాసనలు అంటే ఎన్నో కొరికలు మనం అనుకుంటాము కానీ అన్ని తీరవు. ఈ తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సంచితములై వాసనలుగా మారి మనసును అంటి పెట్టుకొని ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానంలో లేదా భగవంతుడిని ఏకాగ్ర చిత్తంతో పూజ చేస్తున్నపుడు ఈ కోరికలు, భోగాసక్తులు ఒక్కసారిగా నిద్ర లేసి ఈగల్లా ముసురుకుంటాయి. మన తపస్సును భగ్నం చేస్తాయి. ఈ కోరికలు అన్ని భగవంతుడిని ధ్యానించకుండా అడ్డుకుంటాయి. అప్పుడు ఎంతో పట్టుదలతో వీటి అన్నిటిని ప్రక్కన పెట్టి ధ్యానాన్ని కొనసాగించే అవసరం ఎంతయినా ఉంది. పురాణాలలో ఇంద్రుడు తపస్సును భగ్నం చేస్తాడు అని కథల రూపంలో ఉన్న అంతరార్థం ఇదే. కథలలో ఆ ఇంద్రుడు తపస్సు భగ్నం చేస్తే ఇక్కడ మన ఇంద్రియాలకు అధిపతి మన మనసు. అంటే మన మనసే ఇంద్రుడు. మనం ధ్యానంలో ఉన్నపుడు మన మనసు కోరికలను, ఆలోచలను కలిగించి మనల్ని ముంచెత్తుతాయి. ఈ కథల యొక్క అంతరార్థం ఇదే.
0 కామెంట్‌లు