ఆత్మ బోధ సారం-1



             

************ ఆది శంకరాచార్యులవారు ఎన్నో ప్రకరణ గ్రంథాలను రచించారు. వాటిలో ఇది ముఖ్యమైనది అది ముఖ్యమైనది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన వ్రాసిన ప్రతి ప్రకరణ గ్రంధాలు ముఖ్యమైనవి. వాటిలో ఒకటి ఆత్మ బోధ. ఈ ఆత్మ బోధ అనే ప్రకరణ గ్రంధం ఆత్మ విచారణకు అనువైన గ్రంథం. ఈ ఆత్మ బోధ యొక్క సారాన్ని ఇక్కడ ఆత్మబోధ సారంగా వివరించడం జరిగింది. ఇక మనం ఆత్మబోధ సారాన్నిమొదలు పెడదాం !

౼౼౼౼౼౼౼౼×౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మోక్ష సాక్షాత్కారానికి ఒక్క జ్ఞానమే కారణం. జ్ఞానం వలన మాత్రమే మోక్షం అనే అమృతం లభిస్తుంది. కర్మ వలన, భక్తి వలన, ఉపాసన వలన మోక్షం సిద్ధించదు. అంటే కర్మ ,భక్తి, ఉపాసన మోక్షానికి కారణ హేతువులు కావు. అలాగని కర్మ భక్తి ఉపాసన లను ఖండించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం కలగాలి అంటే భక్తి, కర్మ ,ఉపాసన అవసరమవుతాయి. ఈ మూడింటి వలన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ లభించిన జ్ఞానంతో మోక్షాన్ని అందుకో గలము. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. అందులో మొదటిది అజ్ఞానం లేదని భావించి భ్రమలో బ్రతికే వాళ్ళు. ఇలాంటి వాళ్లు దగ్గర దగ్గర 95 శాతం మంది ఉంటారు. రెండవది నాకు అజ్ఞానం ఉంది అని గ్రహించి జ్ఞానాన్ని పొందడానికి ఆరాటపడేవారు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానమంటే మన స్వరూపాన్ని తెలుసుకోవడం. అంటే నేనెవరిని? ఎక్కడ నుండి వచ్చాను? మరలా ఎక్కడికి పోతున్నాను? ఈరోజు ఉండి రేపు పోయే ఈ శరీరము నేనుకాదు. శరీరం లోపలకీ బయటకీ పోయే ప్రాణమును నేను చూస్తున్నాను కాబట్టి ప్రాణము నేను కాదు. మనోబుద్దులు కూడా నేను కాదు. ఎందుకంటే అవి నిద్ర లేచిన తర్వాత ఈ ప్రపంచాన్ని గమనించి రాత్రి నిద్రలో పడిపోయే ఈ మనోబుద్దులు నేను కాదు. మరి ఇవన్నీ నేను కాదు అని తెలుస్తుంది. అలాంటప్పుడు నేను ఎవరిని నా స్వరూపం ఏమిటి అని విచారణ కలగటమే జ్ఞానం. మరి అంతకు ముందు చెప్పినట్లుగా కర్మ భక్తి ఉపాసన వలన జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకున్నాం. నిజమే ఇది పాటించడం వలన జ్ఞానం లభిస్తుంది కానీ ఈ మూడు అజ్ఞానానికి వారసులు. ఎందుకంటే మనం కర్మ ఎందుకు చేస్తాం? కోరిక ఉండటం వలన ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కర్మ చేస్తాం. వచ్చిన కర్మఫలాన్ని అనుభవిస్తాం. అంటే కోరిక మన చేత కర్మను చేయిస్తోంది. మరి కోరిక ఎలా కలిగింది? ఈ కోరిక మనసులో ఉన్న వెలితి కారణంగా కలిగింది. అంటే కోరికకు హేతువు వెలితి. నిద్ర నుండి లేవగానే మన మనసు ప్రపంచంలోకి పరుగులు తీస్తుంది. ద్వైత భావాన్ని కలిగిస్తుంది మన స్వరూపాన్ని మనకు తెలియనివ్వకుండా ద్వంద్వ భావాన్ని కలిగిస్తుంది. అంటే గమనించిన ప్రతిదాన్ని కావాలి ఇది ఉంటే బాగుండును ఇది లేకపోతే బాగుండును అనే భావాలను కలిగించి వెలితిని కలిగిస్తుంది. ఈ వెలితి కారణంగా కోరిక కలుగుతుంది. ఈ కోరిక కారణంగా కర్మ జరుగుతుంది. మరి ఈ వెలితి అనేది ఎలా కలుగుతుంది? ఇది కేవలం మనసుకి అజ్ఞానం ఉండటం వలన మనోబుద్ధులకు అజ్ఞానం కలగడం వలన ఈ వెలితి ఏర్పడింది. అందువలన కర్మ అజ్ఞానం నుండి పుట్టింది. మరి ఈ జ్ఞానం దేనికొరకు అంటే మన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. మనం ఆత్మ స్వరూపం అని తెలియాలంటే జ్ఞానమే అవసరమా? మన స్వరూపం ఆత్మ స్వరూపం అనే తెలిసే ఉపమానం ఒక్క నిద్రలోనే తెలుస్తుంది. మనం నిద్ర లో కి వెళ్ళినప్పుడు మన శరీరం జడత్వాన్ని పొంది ఆచేతనంగా ఉండిపోతున్నాయి. మన మనసు కొంతసేపు స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుని విహరిస్తూ కొంతసేపటికి మనోబుద్దులు కూడా పడిపోతాయి. ఆ తర్వాత మనం గాఢనిద్రలో చేరుకుంటాము దీనినే 'సుషుప్త్యావస్థ' అంటారు ఈ నిద్రలో మనకు ఏమీ తెలియదు. ఉదయాన లేవగానే నిద్రలో ఎలా ఉంది అని అడిగితే హాయిగా ఉంది అని చెబుతాం. శరీరము జడత్వం పొందింది. మనసు పడిపోయింది. మరి హాయిగా ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాం? నిద్రలో అన్నిటినీ వదిలేసి అందరినీ పక్కనపడేసి మనకు మనంగా అంటే నాకు నేనుగా మాత్రమే అక్కడ ఉన్నాను. అక్కడ బాధ లేదు, దుఃఖం లేదు, చెడు లేదు, మంచి లేదు, ఏమీ లేదు కానీ ఆనందం మాత్రం ఉంది. అంటే ఇక్కడ శరీరము నేనుకాదు మనోబుద్దులు నేను కాదు అని తేలిపోతుంది. ఈ ఆనంద స్వరూపాన్ని నిద్రలో అనుభవించ గలుగుతున్నాము గాని పట్టుకోలేకపోతున్నాము. కనిపెట్టలేక పోతున్నాం. ఈ ఆనంద స్వరూపాన్ని పట్టపగలు మాత్రమే పట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్వరూపాన్ని చూడాలంటే మనోబుద్దులు చేతనంగా ఉండాలి. కానీ నిద్రలో మనోబుద్దులు పడిపోతే గాని ఆ స్వరూపం బయటపడదు. పగలు మనోబుద్దులు లేవగానే ఆ స్వరూపం అవగతం కాదు. మరి ఎలా? దీనికి జ్ఞానమే మార్గం. చీకటిగా ఉన్నా గదిలో నీటితో ఎంత శుభ్రం చేసిన చీకటి పోదు. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించగానే వెలుతురు రావడమేమిటి చీకటి పోవడ మేమిటి ఒకేసారి జరుగుతుంది. వెలుతురు యొక్క ఆవిర్భావమే చీకటికి అంతం. అలాగే మనోబుద్ధులకు జ్ఞానం కలగడం ఏమిటి, అజ్ఞానం పోవడం ఏమిటి, ఒకేసారి జరుగుతుంది. కానీ జ్ఞానం కలగాలి అంటే అంతః కరణ శుద్ధి కలగాలి. మరి ఈ అంతఃకరణ శుద్ధి జరగాలి అంటే కర్మ, భక్తి, ఉపాసన అవసరమవుతాయి. ఎందుకంటే ఎన్ని గుళ్ళూ గోపురాలు తిరిగిన, పూజాపునస్కారాలు చేసిన, జ్ఞానం రాదు. ఎన్ని దానధర్మాలు చేసినా, ఎంత అన్న దానాలు చేసినా జ్ఞానం రాదు. ఎన్ని జపాలు చేసిన జ్ఞానం రాదు. మరి ఏమి కలుగుతుంది? ఇవన్నీ చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది. అంతః కరణ శుద్ధి జరుగుతుంది. దీనివలన జ్ఞానం నిలబడుతుంది. ఇప్పుడు శరీరము నేనుకాదు, ఇంద్రియాలు నేను కాదు, మనోబుద్దులు నేను కాదు అని లోతుగా విచారణ చేసినట్లయితే ఆత్మ స్వరూపాన్ని పొందగలుగుతాం. కానీ అక్కడ దాకా వెళ్లలేక పోతాం. ఎందుకంటే  ఆత్మను మనకు తెలియనివ్వకుండా మనోబుద్ధులకు ఆత్మకు మధ్యన మాయ మబ్బులు కమ్ముకుని ఉంటాయి. ఉదాహరణకు సూర్యుడికి మనకి మధ్యన మబ్బులు అడ్డు వచ్చినప్పుడు సూర్యునికి మబ్బులు కమ్ముకున్నాయి అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి సూర్యునికి మబ్బులు కమ్ముకోవు. ఎందుకంటే మబ్బులకు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు ఉంటాడు. నిజానికి మబ్బులు మన దృష్టికి దగ్గరలోనే ఉంటాయి. అలాగే ఈ మాయ మబ్బులు ఆత్మను కప్పలేవు. ఇవి మన మనో బుద్ధులను కప్పుతాయి. కారణం అవిద్య. అంటే అజ్ఞానం. అందుకే ఆది శంకరాచార్యులవారు "అజ్ఞానం కలుషం జీవం" అని అన్నారు. జ్ఞానం అంటే శరీరం నేను కాదు, మనోబుద్దులు నేను కాదు , నేను ఒక ఆత్మ స్వరూపమే అని అనుకోవడం కాదు. ఆత్మానుభూతిని పొందటం. ఈ ఆత్మానుభూతిని పొందాలంటే కచ్చితంగా గురువు అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు శాస్త్రం లో ఉన్న నాలుగు మాటలు చెప్పి భగవంతుని పట్ల భక్తిని కలిగించి ఉపాసనా మార్గాన్ని సూచించి ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానాన్ని బోధించే వాళ్ళు గురువు కాదు. గురువుకి ఆత్మానుభవం కచ్చితంగా ఉండితీరాలి. మోక్ష జ్ఞానం కలిగి ఉండి, ఆత్మానుభవం ఉండి, ఆత్మ విచారణ ఎలా చేయాలో తెలిపి మనకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించిన వారు గురువు అవుతారు. అటువంటి గురువు సమక్షంలో శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకుని గురువు గారి పట్ల భక్తిశ్రద్ధలతో ఆయన మాటలు విని ఆయన ద్వారా ఆత్మ విచారణ చేసినట్లయితే, ఆత్మానుభూతి కలుగుతుంది. అప్పుడు మాత్రమే మన మనోబుద్ధులకు అంటి పెట్టుకున్న అజ్ఞానం తొలగి, జ్ఞానం కలిగి, మన మనోబుద్దులు ఆత్మ వైపు తిరుగుతుంది. ఈ విధంగా మాత్రమే ఆత్మానుభూతిని పొందగలము. మనిషి దైవత్వంలో జీవత్వాన్ని చూడటం ఒక దోషం. ఆ జీవత్వంలో నానాత్వాన్ని చూడటం మరొక దోషం. ఈ ద్వైత్వభావము ఎందుకు కలిగింది అంటే కేవలం అజ్ఞానం వలన , సత్యం తెలియకపోవడం వల్ల మాత్రమే. సత్యం అనేది ఒక్కటే ఉంటుంది. ఈ సత్యం తనకు తానుగా ఉనికిని పొందుతుంది. ఏ విషయం మీద ఏ వస్తువు మీద ఆధారపడదు. అసత్యం సత్యం మీద ఆధారపడి తన ఉనికిని కలిగి ఉంటుంది. ఇక్కడ సత్యం అంటే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనబడిన ఈశ్వర అనబడిన పరమాత్మ అనబడిన ఒకటే. ఉదాహరణకు సముద్రంలో అనేక అలలు ఉంటాయి మరియు నీటి బుడగలు నురుగులు ఉంటాయి. ఈ అలలు గాని నీటి బుడగలు గాని నూరుగులు గాని సముద్రం మీద ఆధారపడి వ్యక్తమవుతున్నాయి. కానీ సముద్రం మాత్రం దేనిమీద ఆధారపడకుండా తనకు తానుగా  వ్యక్తమై తన ఉనికిని చాటుకుంటుంది. మరి ఆ సత్యాన్ని శుద్ధమైన పరమాత్మను ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే మన మనోబుద్ధులకు అజ్ఞానం ఉండటం వల్ల ఆ శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని చూడలేకపోతున్నాం. రాత్రి నిద్రలో జాగృద నుండి స్వపన్నానికి అక్కడ నుండి సుషుప్తికి చేరుతున్నాము.లోకంలో ప్రతి మనిషీ మూడు స్థితుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ స్థితులను అవస్థలు అనీ అంటారు. మనిషి మేల్కొని ఉంటాడు ఇది జాగ్రదవస్థ. కలలు కంటూ ఉంటాడు ఇది స్వప్నావస్థ. గాఢనిద్రలో ఉండే స్థితి సుషుప్త్యావస్థ. ఈ అవస్థల గురించి మాండూక్యోపనిషత్తు లో ప్రశ్నోపనిషత్తు లో పూర్తి వివరణ ఉంది. వీటి గురించి ఆది శంకరాచార్యులవారు ఈ విధంగా వివరణ ఇచ్చారు మనం మేల్కొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. అవి బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉండి అనుభవాలు సంపాదిస్తాయి. ఇది సూర్యోదయం తరవాత సూర్యకిరణాల వ్యాప్తి లాంటిది. సూర్యాస్తమయంలో కిరణాలు ఎలా లయించిపోతాయో అలాగే మనిషి నిద్రిస్తున్నప్పుడు అతడి ఇంద్రియాలన్నీ మనసులో లయించిపోతాయి. ఇంద్రియాలు పనిచేయకపోవడం వల్ల ఎలాంటి బాహ్య అనుభవమూ కలగదు. నగరం రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అదే రీతిలో శరీరం ఆదమరచి నిద్రిస్తున్నా ప్రాణశక్తులు మేల్కొని ఉంటాయి. పని చేస్తూ ఉంటాయి. అవి విశ్రమించవు. హృదయం, పేగులు, మూత్రపిండాలు వంటివి వాటి పనులు చేస్తుంటాయి. తిన్న ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. రక్తం పరిశుద్ధం కావడం వంటి పనులు నిద్రిస్తున్నప్పుడూ జరుగుతూనే ఉంటాయి. జాగ్రదావస్థలో చూసి అనుభవించినవన్నీ సుప్త చేతన మనసులో నమోదవుతాయి. కలలో మనసే ఇవి అన్నిటిగా అయిపోయి మళ్ళీ వాటిని అనుభవిస్తుంది. జాగ్రదవస్థలో మనం చూసినవి, విన్నవి కలలో సంభవించవచ్చు. ప్రగాఢ నిద్రావస్థలో జాగ్రద, స్వప్నాలు లేవు. మేల్కొని ఉండకపోయినా, కలలు కనకపోయినా ఆ ప్రగాఢ నిద్రావస్థను మనం అనుభవిస్తాం. ఎందుకంటే నిద్రలేచిన తరవాత 'నిన్న బాగా నిద్రపోయాను. చాలా సుఖంగా ఉంది' అని చెబుతాం. సుషుప్త్యావస్థలోని లక్షణాలను మాండ్యూకోపనిషత్తు వివరిస్తుంది. ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. కన్ను, చెవి వంటి మన ఇంద్రియాలు చేతన, మనసు, సుప్తచేతన అన్నీ విశ్రాంతిలో మునిగి ఉండటంతో అక్కడ బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలూ ఉండవు. నిద్రిస్తున్నప్పుడు మనసు, సుప్తచేతన లయించినప్పటికీ నేను అనే స్ఫురణ మేల్కొని ఉంటుంది. ఈ విధంగా నేను- స్ఫురణలో లయించిన మనసు బయటకు వస్తున్నప్పుడు అనగా బాహ్యస్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదవస్థను అనుభవిస్తుంది. గాఢనిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్ర నుంచి లేవగానే 'నేను సుఖంగా నిద్రపోయాను' అని మనం చెప్పగలుగుతాం. చూసేది, స్పర్శను పొందేది, వినేది, వాసన చూసేది,  రుచి చూసేది, ఆలోచించేది, గ్రహించేది- వీటన్నింటికీ నేను స్ఫురణే ఆధారం. నిద్రావస్థను అనుభవిస్తున్న ఆ నేను- అమరమైన ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది. శ్రేష్ఠమైన, వినాశన రహితమైన, రంగులేని, స్వచ్ఛమైన ఆత్మను ఎవరు అనుభూతితో గ్రహిస్తారో వారే ఆత్మను పొంద గలుగుతారు. నేను అనే స్ఫురణ, ఇంద్రియాలు, పంచభూతాలు అన్నీ ఎక్కడ విలీనమవు తాయో ఆ ఆత్మను అనుభూతిలో గ్రహించినవాడే సర్వజ్ఞుడు. సరే ఉదయాన్నే నిద్ర లేవగానే నేను అనేవాడు లేచి మన మనో బుద్ధులను ఇంద్రియాలను శరీరాన్ని లేపి నిలబెట్టి ప్రపంచంలోకి నడుపుతున్న అనుభవాలను పొందుతున్నాడు. అయితే నిద్రలో స్వప్నావస్థలో మన మనసు తన ప్రకాశం వలన స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే మన కలలకు కారణం మన మనసు. మరి ఈ జాగ్రద ప్రపంచంలో ఈ అనేక భిన్నత్వాలు అనేక నామరూపాలకు కారణం ఎవరు? ఇప్పుడు స్వప్న ప్రపంచానికి మనసు కారణం అయితే జాగ్రద ప్రపంచానికి రాగద్వేషాలే కారణం. ఈ రాగము, ద్వేషము వలన ఈ భిన్నత్వాలు ఈ ద్వంద్వ తత్వాలు ఏర్పడ్డాయి. ఈ జాగ్రద ప్రపంచంలో సంసారమనెది స్వప్నం లాంటిది. అందుకే శంకరాచార్యులవారు " సంసారః స్వప్న తుల్యహి" అని అన్నారు. అలాగే "రాగద్వేషది సంకులః" అని కూడా అన్నారు అంటే రాగము ద్వేషము అనే రెండు కళ్ళు మనసుకు ఉన్నాయి. ఈ మనసు రాగద్వేషాల తో జగత్తులోని అనగా ప్రపంచంలో ఉన్న నామరూప వస్తువులను ద్వైత్వ భావముతో తిరుగుతూఉంటుంది. ఇప్పుడు రాగద్వేషాలను వదిలి పెడితే గాని ఈ ద్వంద్వ భావన పోదు. మరి రాగద్వేషాలను విడిచి పెట్టడం ఎలా? రాగద్వేషాలు విడిచిపెట్టడం కుదరదు. రాగద్వేషాలు మన మనసు ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టదు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాకు రాగద్వేషాలు లేవు నేను రాగద్వేషాలకు అతీతుడును అని అని చెప్పాడు. కానీ నాకు రాగద్వేషాలు లేవు అని కృష్ణుడు చెప్పిన ఆదిశంకరాచార్యులు చెప్పిన మనము ఒప్పుకో వలసిన అవసరం లేదు. ఎందుకంటే రాగద్వేషాలు ఎవరిని విడిచిపెట్టవు. మరి శ్రీకృష్ణుడు నాకు రాగద్వేషాలు లేవు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? శ్రీ కృష్ణుడు గాని, ఆది శంకరాచార్యులు గాని రాగద్వేషాలు లేవు అని చెప్పడంలో అర్థం ఏమిటంటే వాళ్లకి రాగద్వేషాలు ఉంటాయి. కానీ రాగద్వేషాలు వారి వశములో ఉంటాయి వాళ్లు ఈ రాగద్వేష వశంలో పడిపోరు. నాకు రాగద్వేషాలు లేవు అని చెప్పడంలో అంతరార్థం ఇదే. మనం కూడా వాటి వశంలో పడిపోకుండా ఉన్నట్లయితే ఆ సత్యాన్ని ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతాము. ఈ పరమాత్మ అంతట వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వంలో ఏ పదార్థాన్ని స్పర్శించిన అది పరమాత్మ అవుతుంది. మొదలు లేని చివర లేని సముద్రంలో లో ఎన్నో అలలు ఉంటాయి. ఎన్నో బుడగలు ఉంటాయి. వాటిలో పెద్ద బుడగలు చిన్న బుడగలు ఉంటాయి. అంతేకాకుండా నురుగు కూడా అ ఉంటుంది. ఈ అలలు ఈ చిన్న పెద్ద బుడగలు ఇవన్నీ నామరూపాలు అయితే సముద్రాన్ని స్పర్శించిన, బుడగలను స్పర్శించిన, అలలను స్పర్శించిన అది నీరు మాత్రమే. ఇన్ని రూపాలు ఉన్నా నిజానికి అవి నీరు మాత్రమే. అలాగే జగత్తులో అంతటా ఉన్నది పరమాత్మ మాత్రమే పరమాత్మను బ్రహ్మ అనిన విష్ణువు అనిన శివ అనిన ఒక్కటే. బ్రహ్మా అంటే సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే తత్వాన్ని బ్రహ్మ అంటారు. అంతటా వ్యాపించి ఉన్న తత్వాన్ని విష్ణు అంటారు. శివ అంటే మంగళం. అంతట తనలో ఇముడ్చుకుని అంతటా వ్యాపించి ఉన్నది మంగళ కారుడు అని అర్థం. పుట్టినప్పుడు మైల అంటారు చనిపోయినప్పుడు మైల అంటారు. అంటే అమంగళం అని అర్థం. చావు పుట్టుకలు లేకపోతే అమంగళం ఉండదు. మంగళం మాత్రమే ఉంటుంది. అదే శివం అదే మోక్షం. సరే ఇప్పుడు ఉన్నది పరమాత్మే జగత్తు లేదు అంటున్నారు. మరి ఈ జగత్తు అన్నది కనిపిస్తుంది గా? లేదని ఎలా అనుకోగలం? ఆది శంకరాచార్యులవారు "బ్రహ్మ సత్యం జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నా పరః" అని అన్నారు. మరి జగత్తు మిథ్య అని ఎలా అనగలం? ఇక్కడ జగత్ మిథ్య అంటే జగత్తు లేదని అర్థం కాదు. జగత్తు ఉంటుంది కానీ కల్పితము, కల్పము. ఉదాహరణకు ఒక బంగారపు ఉంగరం ఉంది. ఆ బంగారపు ఉంగరంలో బంగారం ఉందా?ఉంగరం ఉందా? అంటే బంగారం అన్నది సత్యమా? ఉంగరం అన్నది సత్యమా? అనేది అన్వయం చేయాలి. అంటే ఒకటి ఉంటే మరొకటి ఉంది ఒకటి పోతే మరొకటి పోతుంది. ఒకటి పోయినప్పుడు మరొకటి ఉంది అంటే ఆ వున్నది సత్యం. ఇప్పుడు బంగారపు ఉంగరం లో బంగారం పోతే ఉంగరం కూడా పోతుంది. బంగారం ఉంటే ఉంగరం కూడా ఉంటుంది కానీ ఉంగరం పోతే బంగారం మాత్రం పోదు. ఎందుకంటే ఉంగరం అనే నామ రూపం బంగారం నుండి వచ్చింది. ఏ రకమైన ఆభరణము అయినా బంగారం నుండి వచ్చింది. ఈ ఆభరణాలు యొక్క నామరూపాలు బంగారం నుండే పుట్టాయి మరియు బంగారం లోనే లయం అవుతాయి. అంటే బంగారం సత్యం. ఆ విధంగానే పరమాత్మ నుండి ఈ జగత్తు పుట్టింది. తర్వాత ఈ జగత్తు పరమాత్మలోనే లయం అవుతుంది. జ అంటే జన్మించడం, గ అంటే గతించడం ఇదే జగత్తు. అందుకే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. మరి జీవుడు సంగతి ఏంటి? అన్నది ఒక ప్రశ్న ఇప్పుడు ఈ జగత్తులో రెండు రకాలు ఉన్నాయి మొదటిది ఆచేతనము రెండవది చేతనము. ఆచేతనము అంటే జడత్వాన్ని కలిగి ఉండటం కదలిక లేకుండా ఉండటం. కొండలు, గుట్టలు, పర్వతాలు, రాళ్ళు వీటికి చలనం ఉండదు ఊపిరి తీసుకోవు. ఒక రాయి వేరొక రాయికి జన్మను ఇవ్వలేదు. వేతనములు అంటే కదలికలు కలిగినవి. ప్రాణవాయువును తీసుకోగలిగినవి జన్మను ఇవ్వగలిగినది. అవి వృక్షాలు, పక్షులు, క్రిమికీటకాలు, పశువులు. పశువులలో రెండు రకాలు. మొదటిది నాలుగు కాళ్లు గలిగినవి రెండవది రెండు కాళ్లు కలిగినవి నాలుగు కాళ్ళు కలిగిన వాటిని 'తిర్యక్ జీవులు' అంటారు. రెండు కాళ్లు కలిగి ఉన్నవాటిని నరులు అంటారు. మానవులు కూడా పశు జాతికి చెందిన వాళ్లే. అంతేకాకుండా మానవుల్లో పురుషులు, స్త్రీలు, పొడుగు వాళ్ళు, పొట్టి వాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళు,మరియు నల్లగా ఉన్న వాళ్ళు ఇలాగా నానా రకాల భేదాలు. ఉదాహరణకు భారతదేశం మొత్తం వర్షం పడినట్లయితే వర్షం యొక్క బిందువులు ఒకలాగే ఉంటాయి. వాటి మధ్య ఏ భేదము ఉండదు. ఆ వర్షపు బిందువులు హిమాలయాల్లో పడితే గంగా అంటున్నాము వేరొకచోట పడితే యమునా అంటున్నాం. మరొకచోట పడినట్లయితే గోదావరి అంటున్నాము. ఆకాశంలో వర్ష బిందువులుగా ఉన్నప్పుడు వాటి మధ్య ఏ భేదములు లేవు ఎప్పుడైతే క్రిందకు జారి పడిందో, వాటి యొక్క నామరూపాలు మారిపోయాయి. వాటి యొక్క గుణాలు మారిపోయి స్వప్రభావాలు మారిపోయాయి. గంగా నదిలో పడిన నీటి బిందువులు గంగా నది యొక్క గుణము స్వభావము రుచి అంటుకున్నాయి. అలాగే గోదావరి కావేరి మరుగున పడిన వర్షపు బిందువులకు ఆ నదుల యొక్క గుణాలు స్వభావాలు రుచులు అంటుకున్నాయి. ఆకాశం లో ఉన్నప్పుడు ఆ వర్షపు బిందువులకు ఇటువంటి భేదాలు లేవు. జారి పడిన తర్వాత వాటి యొక్క స్వభావాలలో గుణాలలో మార్పులు కలిగాయి. అదేవిధంగా జీవుడు పరమాత్మ నుండి జారి పడటం వలన ఈ భేదాలు స్వభావాలు నామరూపాలు కలిగాయి. జీవుడు పరమాత్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఏ బేధాలు లేవు. ఎప్పుడైతే పరమాత్మ నుండి జారిపడ్డాడో, నామరూపాలు గుణాలు స్వభావాలు అన్నీ అంటుకున్నాయి. మరి ఈ జీవుడు పరమాత్మ నుండి ఎలా జారిపడ్డాడు? దానికి కారణం "మాయా కార్యం" వీటన్నిటికీ కారణం 'మాయా'. ఈ మాయ అనేది ఎన్ని కార్యాలు చేసిందంటే ఊహకు కూడా అందదు. ఈ మాయ అనేది ఎన్నో నామ రూపాలను భేదాలను సృష్టించింది. ఈ మాయ అనేది మూడు గుణాలతో తయారయింది. అవి ఏమిటంటే మొదటిది సత్వగుణము, రెండవది రజోగుణము, మూడవది తమోగుణము ఈ మూడు యొక్క గుణములు చేత మాయ అనేది ఏర్పడింది. ఆది శంకరాచార్యులవారు ఈ మాయా అన్నది ఎన్ని శరీరాలను తయారుచేసిందో ఈ ఆత్మబోధలో చాలా అద్భుతంగా వివరించారు. ఈ మాయ అనునది మూడు రకాల శరీరాలను సృష్టించింది. ఆది శంకరాచార్యులవారు శరీరాలు అనే కన్నా ఉపాధులు అని సంబోధించారు. ఈ మాయ చేసిన మూడు ఉపాధులు ఏమిటంటే, మొదటిది స్థూలఉపాధి రెండవది సూక్ష్మ ఉపాధి మూడవది కారణ ఉపాధి ఇప్పుడు స్థూల ఉపాధి ఎలా ఏర్పడిందో చూద్దాం. శంకరాచార్యులవారు స్థూల ఉపాధి గురించి ఈ విధముగా వివరించారు. "పంచికృత మహా భూతం సంభవం కర్మ సంచితం" అంటే స్థూలశరీరం ఎలా ఏర్పడింది అంటే, పంచమహాభూతాలు పంచీకరణం చెంది సంచిత కర్మలు తోడై స్థూలశరీరం ఏర్పడింది. స్థూలశరీరం అంటే మన యొక్క శరీరం ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, మొండెం ఇవన్నీ కలబోసి ఏర్పడిన శరీరమే ఈ శరీరం. పంచమహాభూతాలు అనగా ఆకాశం గాలి అగ్ని జలము పృథ్వి వీటిని పంచమహాభూతాలు అంటారు. ఈ ఐదు ఒక్కొక్కటి అనగా ఈ ఐదు తత్వాలు ఆకాశ తత్వం, వాయు తత్వం, అగ్ని తత్వం, జల తత్వం, పృథ్వి తత్వం రెండుగా విభజించబడింది. అందులో ఒక భాగం పైన ఉండిపోయింది మరో భాగం మరలా రెండుగా
విభజించబడింది. ఒక భాగం సూక్ష్మంగా ఉండిపోయి, మరొక భాగం నాలుగు గా విభజించబడింది. అన్ని అదే విధముగా విభజించబడ్డాయి నాలుగు గా విభజించబడిన ఆకాశ తత్వం ఒక భాగం వాయు తత్వంలో మరొక భాగం అగ్ని తత్వంలో మరొక భాగం జల తత్వంలో మరొక భాగం పృథ్వి తత్వంలో పంచీకరణం చెందాయి. అదేవిధంగా నాలుగు భాగాలు గా విభజించబడిన వాయు, అగ్ని, జల, పృథ్వి తత్వాలు కూడా ఈ విధముగానే పంచీకరణం చెందాయి. ఇలా పంచీకరణం చెందిన వాటికి సంచిత కర్మలు తోడై అనగా జన్మజన్మలగా వెంట వస్తున్న కర్మలు వాసనలు మరియు మాయా లోని మూడో గుణమైన తమోగుణము తోడై స్థూలశరీరం ఏర్పడింది. ఇలా ఏర్పడిన శరీరం జడం అంటే జడ ప్రవృతి ఇది. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను సేకరిస్తుంది. అంటే కంటితో మంచి విషయాలను లేదా చెడ్డ విషయాలను చూస్తుంది. చెవి మంచి విషయాలను చెడ్డ విషయాలను వింటుంది. ముక్కు మంచి చెడ్డ వాసనలను గమనిస్తుంది. నాలుక రుచిని గమనిస్తుంది. చర్మం కూడా స్పర్శను గమనిస్తుంది. ఈ స్థూల శరీరం ప్రకృతిలో ఉన్న విషయాలను గమనించి శరీరం లోపల ఉన్న ఇంద్రియాలకు చెర వేయడమే దాని యొక్క పని. ఇక రెండవ ఉపాధి సూక్ష్మశరీరం. ఈ సూక్ష్మశరీరం పంచికృతం కాకుండా, మిగిలి ఉన్న సూక్ష్మ పంచభూతాలు పదిహేడు తత్వాలు కలిగిన సూక్ష్మ శరీరాన్ని తయారు చేశాయి. అవి ఏమిటంటే సూక్ష్మ ఆకాశ తత్వం నుండి బుద్ధి, సూక్ష్మ వాయు తత్వం నుండి మనసు ఏర్పడింది. అంటే ఈ రెండు తత్వాల నుండి మనోబుద్దులు ఏర్పడ్డాయి. సాధారణంగా మనోబుద్దులు అంటే చిత్తము బుద్ధి మనస్సు అహంకారము అంటారు. మరి ఇక్కడ మనసు బుద్ధి గురించే చెప్పారని అనుమానం కలుగవచ్చు. శాస్త్రాలలో ఈ రెండిటిని నాలుగు గా చెబుతారు. బుద్ధి యొక్క వికల్పమే అహంకారము. మనసు యొక్క వికల్పమే చిత్తము. ఈ ఆకాశ తత్వం నుండి బుద్ధి ఏర్పడగా, వాయు తత్వం నుండి మనసు ఏర్పడింది. అందుకే ప్రాణాయామం చేస్తే మనసు అదుపులో ఉంటుంది అంటారు. "ఉపదేశసారము"లో రమణ మహర్షుల వారు మనసు నిలకడగా ఉండాలంటే వాయు బంధనం చేయాలి అని చెప్పారు. ఇక సూక్ష్మ అగ్ని తత్వం నుండి పంచప్రాణాలు ఏర్పడ్డాయి. పంచప్రాణాలు అంటే ప్రాణ,అపాన,వ్యాస,ఉదాన, సమాన. ఈ ఐదింటిని కలిపి పంచప్రాణాలు అంటారు. సూక్ష్మ పృథ్వి తత్వం మరియు సూక్ష్మజల తత్వం నుండి పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ సూక్ష్మ అగ్ని,జల, పృథ్వి తత్వాలకు మాయ లోని రెండవ గుణమైన రజోగుణం తోడై పంచప్రాణాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. సూక్ష్మ ఆకాశ వాయు తత్వాలకు, మాయలోనీ మొదటి గుణమైన సత్వగుణం తోడై మనోబుద్దులు ఏర్పడ్డాయి. వీటితో పాటు సంచితకర్మలు తోడై సూక్ష్మశరీరం(సూక్ష్మఉపాది) ఏర్పడింది.ఈ విధముగా సూక్ష్మశరీరం ఏర్పడింది. ఇక మిగిలింది కారణ శరీరం. ఇది పైకి కనిపించే స్థూల శరీరం లాంటిది కాదు. అలాగని మనోబుద్దులు లాంటి సూక్ష్మ శరీరం కాదు. మరి ఏమిటిది? ఈ కారణఉపాధి ఏమిటంటే అనాది, అవిద్య, అనిర్వాచ్చ. దీనికి ఏ గుణము లేదు. ఏ భూతము లేదు. అనాది అంటే ఎప్పుడు పుట్టిందో చెప్పలేం. స్థూల,సూక్ష్మ ఉపాధులు ఎప్పుడు పుట్టాయో తెలుసుకోవచ్చు. కానీ కారణఉపాధి ఎప్పటిదో తెలుసుకోవడం కష్టం. అవిద్య ఆంటీ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. అనిర్వాచ్చ ఆంటీ ఎలా ఉంటుందో వివరించలేము. ఇప్పుడు ఒక మనిషిని నిద్ర లేచిన తర్వాత నిద్రలో ఎలా ఉంది అని అడిగితే అతను హాయిగా ఉందండి అంటాడు. ఆ హాయిలో ఎలా ఉన్నావు అని అడిగితే అతను ఏమోనండీ హాయిగా ఉన్నాను అంతే అంటాడు. అది ఎలా ఉంది అని అడిగితే, అతను ఏమో చెప్పలేను అంటాడు. అక్కడ నువ్వే ఉన్నావా ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అతను లేదండి నేను మాత్రమే ఉన్నాను నా ఉనికి నాకు తెలుస్తుంది అని అంటాడు. అంటే నిద్రలో స్వప్న ప్రపంచంలో విహరించే మనోబుద్దులు పడిపోయిన తరువాత కలిగే గాఢనిద్రే కారణ ఉపాధి. ఇది ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ కారణ ఉపాధిని గుర్తించాలంటే గుర్తించే మనోబుద్దులు ఉండాలి. కానీ అవి నిద్రలో పడిపోతున్నాయి. ఈ మనోబుద్దులు పడిపోతే గాని గాఢనిద్ర కలగదు. మనోబుద్దులు లేచిన తర్వాత జగత్తు వైపు పరుగులు తీస్తుంది కానీ కారణ శరీరాన్ని గుర్తించలేదు. ఎందుకంటే కారణ శరీరాన్ని గుర్తించకుండా మాయ కప్పేస్తుంది. ఈ మాయ మనోబుద్దులను అంతర్ముఖంగా వెళ్ళనివ్వకుండా బహిర్ముఖం చెందేలా చేస్తుంది. అందువలన కారణ ఉపాధిని తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మూడు ఉపాదులను దాటినట్లు అయితే అక్కడ ఉండేది ఆత్మ స్వరూపం. అదే ఆత్మ. ఇప్పుడు మనిషి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఈ మూడు ఉపాధులతో కూడిన అనగా స్థూల, సూక్ష్మ కారణ ఉపాదులతో కూడిన పంచ కోశాలను విడగొట్టాలి అసలు పంచకోశాలు అంటే ఏమిటి పంచకోశాలు ఐదు అవి మొదటిది అన్నమయకోశము రెండవది ప్రాణ మయ కోశము మూడవది మనుమయకోశము నాలుగవది విజ్ఞానమయకోశము ఐదవది ఆనందమయ కోశం. ఆత్మను ఐదు పంచ కోశాలు కప్పి ఉంచుతాయి ఈ అయిదు కోశాలను వివేకంతో విడగొట్టాలి వివేకం అనేది బుద్ధికి సంబంధించింది వడ్ల గింజకు పొట్టు ఎలా చుట్టుకుని ఉంటుందో అదే విధముగా ఆత్మకు ఈ పంచ కోశాలు చుట్టుకొని ఉంటాయి ఇప్పుడు ఈ అయిదు కోశాల గురించి తెలుసుకుందాము. 1) అన్నమయకోశము౼ ఇది అన్నంతో తయారైన స్థూలశరీరం. ఇది పంచభూతాలతో తయారైనది తమో గుణాన్ని కలిగి ఉండేది. భూమి నుండి వచ్చిన అన్నాన్ని తండ్రి తినడం ద్వారా ధాతువు తయారయ్యి తల్లి గర్భంలో శిశువు రూపాన్ని దాల్చి తర్వాత ప్రపంచం లోకి వచ్చి భూమి నుండి వచ్చిన అన్నంతో పెరిగి మరలా భూమిలో కలిసి పోయేదే స్థూలశరీరం. ఇది జగత్తులోని విషయాలన్నిటినీ ప్రోగు చేసుకుని ఇంద్రియాలకు చేరవేస్తుంది. కంటితో జగత్తులోని విషయాలను గమనించి మనసుకు చేరవేస్తుంది. అలాగే చెవి అనేక విషయాలను విని మనసుకు చేరవేస్తుంది. నాసికం అనేక రకాల వాసనలను సేకరించి మనసుకు చేరవేస్తుంది. నాలుక అనేక రుచులను మనసుకు చేరవేస్తుంది. అంతేకాకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణవ్యవస్థ, కాళ్లు చేతులు మొదలైన భాగాలు తమ తమ కర్మలను నిర్వర్తిస్తాయి ఈ విధులను నిర్వర్తించే తమో గుణం కలిగిన ఈ స్థూల శరీరమే అన్నమయకోశము. 2) ప్రాణమయకోశము౼ ఈ ప్రాణ మయ కోశము రెండవ కోశము. ఇది శరీరం లోపలకి బయటికి ప్రవహించే ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు శరీరం లోపల కి ప్రవహించి ఐదు రకాలుగా అంటే ఐదు ప్రాణాలు గా విడిపోతుంది దీనినే పంచప్రాణాలు అంటారు అవి ప్రాణ,అపాన,వ్యనా,ఉదాన, సమానవాయువులు. ఈ పంచ ప్రాణాలు ఇంతటి స్థూల శరీరాన్ని నడిపిస్తుంది. ఈ పంచప్రాణులు చేసే విధులను ★) ప్రాణ౼ ఇది ఉదరంలో ఉంటుంది. ఇది శరీరంలోని అగ్నిని ప్రజ్వలిస్తుంది. ఆహారాన్ని జీర్ణం కావడానికి అవసరమయ్యే ఉదరంలోని అగ్నిని ప్రేరేపిస్తుంది. శరీర కణాలకు శక్తిని అందిస్తుంది. అందువలన పెద్దలు ప్రాణాయామం చేయమని చెబుతుంటారు. ప్రాణాయామం చేయటం వలన శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. ★) ఆపాన౼ ఇదే మూలాధారము నందు ఉంటుంది ఇది శరీరంలో వ్యర్థ వాయువులను బయటకి పంపిస్తుంది. ★) వ్యాన౼ ఇది శరీరంలో ఉన్న అన్ని నాడులకుశక్తినిఅందిస్తుంది. ★) ఉదాన౼ ఇది రక్తాన్ని గుండెకు చేర్చడానికి ఉపకరిస్తుంది. అనగా ఉదాన వాయువు శరీరంలో ప్రవహించే రక్తాన్ని గుండెకు పంపిణీ చేస్తుంది. అప్పుడు ఈ గుండె రక్తాన్ని శుద్ధి చేసి అశుద్ధం వంటి మలినాలను వడగట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ★) సమాన౼ ఈ సమాన వాయువు రక్తంలోని ఉన్న సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు అవసరమైన శక్తిని సారం ద్వారా అందిస్తుంది. దీనివలన శరీరం శక్తిని పుంజుకుంటుంది. 3) మనోమయ కోశము౼ అంతఃకరణాల లో చెప్పుకునే మనోబుద్ధులలో మనసుకు సంబంధించిందే మనుమయకోశము. వస్తువృత్తులను కలిగి ఉన్నదే మనసు. అంటే మనము కనులు మూసుకుని అరటిపండు అనుకుంటే అరటిపండు కనిపిస్తుంది ఏనుగు అనుకుంటే ఏనుగు కనిపిస్తుంది ఒక నది అనుకుంటే నది కనిపిస్తుంది. అనుకున్నప్పుడు కనిపించే ఆకారాలే మనసు. మనము చిన్న చిన్న వస్తువులను చేతితో పట్టుకో గలుగుతాము. కానీ నదిని కొండలను పర్వతాలను తట్టుకోలేము. కానీ మన మనసు గుండు సూది నుండి పర్వతాలు వరకు పట్టుకో గలుగుతుంది. ఈ మనసుకి పరిమితులు ఉండవు. అపరిమితమైన వృత్తులను పెట్టుకుంటుంది. 4) విజ్ఞానమయ కోశము౼ మనసులోని కలిగిన వృత్తులు అన్ని బుద్ధి లోనే చేరుతుంది. ఈ బుద్ధి మనసు నుండి వచ్చిన వృత్తుల అన్నిటిని ఏది అవసరమో ఏది అనవసరమో ఏదీ ఉచితంమో ఏది అనుచితమో గుర్తించి అనవసరమైన వాటిని తీసివేస్తుంది. బుద్ధి అనేది సముద్రగర్భం లాంటిది. సముద్రం లోపల ఎన్నో రకాల జీవరాశులు, ముత్యపు చిప్పలు, రత్నాలు, వైడూర్యాలు, ఇలా ఎన్నో రకాల సంపదలు నిక్షిప్తమై ఉంటాయో, అదే విధముగా బుద్ధిలో ఎన్నో రకాల వృత్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇదియే విజ్ఞానమయ కోశం. 5) ఆనందమయ కోసము౼ మనము ఎండలో తిరిగి తిరిగి ఇంటికి చేరిన తర్వాత చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఆ నీటిని తాగిన తర్వాత మనకు హాయిగా అనిపిస్తుంది. ఆనందంగా అనిపిస్తుంది. ఎండలో తిరిగిన అనుభవాన్ని మరిచిపోయి కొంతసేపు ఆనందాన్ని అనుభవిస్తాము. ఈ ఆనందాన్ని అనుభవించేదే ఆనందమయ కోశం. భౌతికంగా లభించే ఈ ఆనందం కొంత సమయం వరకే ఉంటుంది. ఇది ఒక పరిమితి వరకే ఉంటుంది. ఇదియే ఈ ఐదు కోశాల యొక్క విశిష్టత. ఈ కోశాలన్ని మయంతో కూడి ఉంటాయి. మయము అంటే వికారము అని అర్థము. అందుకే వీటిని వికార కోశాలు అని అంటారు. ఈ ఐదు కోశాలు వికారాలను కలిగి ఉంటాయి. అన్నమయకోశానికి ఆరు వికారాలు కలిగి ఉంటాయి. మొట్టమొదటగా ఒక తండ్రి నుండి దాతువుగా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది ఈ ధాతువు మొదటి వికారము. తరువాత ఈ ధాతువు పిండ రూపాన్ని దాల్చుతుంది ఇది రెండవ వికారము. తరువాత శిశువుగా మారి తల్లి గర్భం నుండి బయటికి వస్తుంది . ఇది మూడవ వికారము. తరువాత ఆ శిశువు పెరిగి పెద్ద అవుతుంది. ఇది నాలుగవ వికారము. తర్వాత క్షిణిస్తుంది. ఇది అయిదవ వికారము. తర్వాత నశిస్తుంది. ఇది ఆరవ వికారము. ఇలా ఆరు పొందుతుంది అనగా ఆరు మార్పులను పొందుతుంది. ఇలా మార్పులు చెందే స్థూల శరీరాన్ని అన్నమయ దేహము అంటారు. ప్రాణమయ కోశానికి రెండు వికారాలు ఉంటాయి. అవి ఆకలి దప్పికలు ఈ రెండు మార్పులు కలిగి ఉన్నది ప్రాణమయము. మనోమయము నాలుగు వికారాలను కలిగి ఉంటుంది. అవి సంకల్ప వికల్పాలు మరియు రాగద్వేషాలు ఈ నాలుగు మార్పులను చెందిన మనసే మనోమయ కోశం. ఈ మనసు వృత్త విశేషాలను కలిగి ఉంటుంది. తర్వాత విజ్ఞాన మయము. ఇది ఇది బుద్ధి విశేషాన్ని కలిగి ఉంటుంది. ఈ విజ్ఞాన మయము రెండు వికారాలను కలిగి ఉంటుంది. అవి కర్తృత్వ,భోక్తృత్వ వికారాలను కలిగి ఉంటుంది. అంటే ఇది నేను చేస్తున్నాను ఇది నేనే అనుభవిస్తున్నాను అనే భావాలను కలిగి ఉంటుంది. 'నేను' అనే స్మరణం కలిగి ఉంటుంది. ఇదియే బుద్ధిమయము. ఇక మిగిలినది ఆనందమయము ఇది అజ్ఞాన విశేషాన్ని కలిగి ఉంటుంది. అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే ఏమీ తెలియడం లేదు అంటాము. ఏమీ తెలియడం లేదు అంటున్నానంటే అదే అజ్ఞానం. ఈ ఆనందమయానికి మూడు వికారాలు ఉన్నాయి. అవి ప్రీతి, మోద, ప్రమోద ప్రీతి అంటే ఏదైనా ఒక అనుభవాన్ని కోరుకోవడం మోద. అంటే కోరుకున్న కోరిక తీరే అనుభవానికి వచ్చినప్పుడు కలిగే ఆనందమే మోద. ప్రమోద అంటే ఒకే అనుభవం పదే పదే అనుభవానికి వచ్చినప్పుడు తిరస్కరణ భావం కలగడమే ప్రమోద. ఈ మూడు వికారాలకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనకు పాయసం తినాలి అనే కోరిక కలగడం 'ప్రీతి'. ఆ పాయసం తిన్నప్పుడు కలిగే ఆనందం 'మోద'. ఆ పాయసం ఎంత రుచిగా ఉన్నా ఎక్కువగా తిన్న కొద్ది ఆ పాయసం మీద అనాసక్తి కలగడం 'ప్రమోద' అంటారు. ఈ విధముగా ఈ కోశాలన్నీ వికారాలను కలిగి ఉంటాయి. 
 ★★మిగిలిన భాగమును దయచేసి ఆత్మబోధ సారము౼2 లో చదవగలరు.★★ ★★