భగవంతుడు ఎవడు?ఎక్కడ ఉంటాడు?
*************************************
ఇది చాలా సున్నితమైన ప్రశ్న.ఈ ప్రశ్న అందరిలోనూ తలెత్తే ప్రశ్న.దీనికి జవాబు ఎంతో జ్ఞానం ఉంటే గాని తెలియదు.ఒకవేళ ఎవరైనా వివరించి చెప్పినా ఆకళింపు చేసుకునే స్థాయిలో జ్ఞానం,శ్రద్ద ఉండాలి.మన వేదాలు,ఉపనిషత్తులు
ఈశ్వరుని గురించి సున్నితంగా వివరించాయి. ఋగ్వేదంలో సృష్టి క్రమాన్ని వివరించినపుడు భగవంతుని గురించి ఈ విధంగా చెప్పింది. " సత్తు లేదు అసత్తు లేదు మృత్యువు లేదు అమృతము లేదు వాయువు లేని చోట గంభీరంగా శ్వాషిస్తూ ఎదో ఆవరించి ఉంది". ఉపనిషత్తులు బ్రహ్మ గురించి ఈ విధంగా చెబుతున్నాయి ( బ్రహ్మ అనిన ఈశ్వరుడు అనిన భగవంతుడు అనిన ఒక్కటే.) ఈశ్వరుని ఒక రూపంతో చెప్పలేము ఒక వస్తువుతో వర్ణించలేము ఒక పదార్థంతో పోలిక చేయలేము. నిరాకారుడు, నిర్గుణుడు అవ్యక్తంగా ఉంటాడు. శ్రీ భగవత్పాదులు ఆదిశంకరాచార్యులవారు అద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. 'ఉన్నది ఒక్కటే రెండవది లేదు ".అంటే ఉన్నది ఒక్కటే పరమాత్మ. రెండవది జగత్తు అనేది మిధ్య (మాయ,బ్రమ, బ్రాంతి). ఈశ్వరుని నామ వస్తువులతో వర్ణించలేము.ఇది కాదు అని చెప్పగలం గాని ఇది అవును అని పరమాత్మని చెప్పలేము. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము , జీవ పరమాత్మల భేదము, అవిద్య (మాయ), మాయా చైతన్యాల సంబంధమూ , ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి , మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని అంగీకరించాలి. అలా కాకుండా, స్వభావంచేతనే సృష్టి జరుగుతోందని అంటే, దాన్లో ఒక పద్ధతీ, నియమమూ ఉండకూడదనేది స్పష్టమవుతుంది. నామ రూపాలచేత విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఊహించడానికి కూడ శక్యంగాని విధంగా సృష్టి రచనావిధానం తెలియబడుతోంది. బ్రహ్మసూత్రాల్లో “జన్మాద్యస్య యతః “ - అంటే ఈ జగత్తుయొక్క జన్మ- స్థితి - ప్రళయములు దేనివల్ల కల్గుతున్నాయో, అది బ్రహ్మము అని చెప్పబడింది. “సృష్టికి పూర్వం బ్రహ్మమొక్కటే ఉండెను. మాయలచేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి కారణం ఏదీ లేదు. కార్యం కూడ ఏదీ లేదు. ద్వితీయ వస్తువేదీ లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమునూ అనుభవించేది, తెలుసుకొనేదీ” అనే వాక్యాలు ఛాందోగ్యోపనిషత్తు యందు చెప్పబడ్డాయి. ఈ అద్వైత సిద్ధాంత నిరూపణ ఉపనిషత్తులలో పరాకాష్ఠ నందుకొన్నది. ఇదే భారతీయ వేదాంతం. భారతీయ జీవనవిధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవం అయిన ఈ వేదాంతానికి రూపుదిద్దిన మహనీయులు ఆదిశంకరాచార్యులవారు. పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది. అద్వైతం 'ఏకమేవా ద్వితీయం బ్రహ్మ' 'ఏకం సద్విప్రా బహుధా వదంతి' 'సర్వం ఖల్విదం బ్రహ్మ' 'జీవో బ్రహ్మైవ నాపరః' 'తత్త్వమసి' వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. జీవాత్మ పరమాత్మరూపమే. అయితే మాయాసంబంధముచేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు. జ్ఞానంద్వారా ఈ సత్యాన్ని గ్రహించగల్గుతుంది. ఈ జ్ఞానంపొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మయై ఊరకుంటుంది. ఇదే సిద్ధాంతాన్ని భగవద్గీత కూడా ప్రతిపాదించింది. ఇలాంటి జ్ఞానంపొందడం ప్రపంచంలో అందరికీ సాధ్యంకాదు. అందుచే పరమాత్మకు రూపం కల్పించుకొని ఇష్ట దేవతగా భావించుకొని ఆ దేవత నారాధించడంద్వారా సంసారులు క్రమశః జ్ఞానంపొంది మోక్షసిద్ధికి ప్రయత్నించవచ్చు.
0 కామెంట్‌లు