మనసును నిగ్రహించుకోవడమెలా? అని ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళలో కలిగే ప్రశ్న. మొదటగా సాధన చేసే వాళ్ళలో తలెత్తే సమస్య? ఈ సమస్యను అధిగమించడం అంత సులభమైన కార్యం కాదు. ఈ సమస్యను అధిగమిస్తే ఆధ్యాత్మిక సాధన ప్రశాంతంగా సునాయాసంగా అంతరాయం లేకుండా కొనసాగుతుంది. ఈసాధనకు మనసుకు సంబంధం ఏమిటి అని భక్తి మార్గంలో ఉన్న వాళ్లకి అనుమానం కలుగుతుంది. మనసు అనేది చంచలన స్వభావాన్ని కలిగి ఉంటుంది. చలనత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనసును వానరం తో పోల్చారు. దేహానికి శక్తి కలగాలంటే మనం తినే ఆహారం ద్వారా శక్తి లభిస్తుంది.
అదే మనసుకు శక్తి కలగాలంటే వాయు ద్వారా లభిస్తుంది. మనసు ఆధీనంలోకి రావాలంటే ప్రాణవాయువును ఆపినట్లయితే మనసు ఎంత దూరంలో ఉన్నా మన ఆధీనంలోకి వస్తుంది. అందుకే ప్రాణాయామం చేసినట్లయితే మనసు కాసేపు అధీనంలో ఉంటుంది అని అంటారు. ఇప్పుడు సాధన చేసే వాళ్లకు మనసు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. పరమాత్మ కోసం సాధన చేస్తున్నప్పుడు, మనసు పరమాత్మ వైపు తిరగకుండా బయట ప్రపంచంలోకి విహరిస్తుంది. ఇందుమూలంగా సాధకుడు అసహనానికి గురై ఇబ్బంది పడతాడు. మనసును శివుని వైపు బలవంతంగా తిప్పినట్లయితే, మనసు మరీ మొండిగా వ్యవహరించి మన మాట వినకుండా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తుంది. ఇందుమూలంగా సాధనకు భగ్నం ఏర్పడుతుంది. సాధన కొనసాగాలంటే మనసు పరమాత్మ యందు స్థిరముగా ఉండాలి. లేకపోతే సాధన కొనసాగదు. కానీ మనసు స్థిరంగా పరమాత్మ యందు నిలవదు. మన మనసును సరిగ్గా వాడుకున్నట్లైతే, మన మిత్రుడిగా మారి మన సాధనకు భగ్నం కలగకుండా స్థిరంగా ఉంటుంది.ఇదే విషయాన్ని భగవద్గితలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః"
నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. ఇప్పుడు ఏమిటి పరిష్కారం? దీనికి పరిష్కారం జగద్గురువైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో అందించాడు.
"యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ "
ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. అంటే మనసును స్వేచ్ఛగా వదిలివేయాలి. బలవంతంగా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనసు ఏ విషయం వైపు ఆసక్తి చూపిస్తుందో, ఆ విషయాన్ని మనం పరమాత్మతో విలీనం చేయాలి. ఉదాహరణకు సాధన లో ఉన్నప్పుడు మన మనసు సముద్రం వైపు వెళ్ళినట్లయితే, మనం మనసును వెనక్కి లాగకుండా, ఆ సముద్రాన్ని పరమాత్మతో అనుసంధానం చేయాలి. ఈ సముద్రం ఎంత అందంగా ఉంది ఈ పరమాత్మ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది ఆ పరమాత్మ ఈ సముద్రాన్ని ఎంత అందంగా సృష్టించాడు అని అనుసంధానం చేయాలి. మనసు చేసే ఏ ఆలోచనలు అయినా పరమాత్మతో అనుసంధానం చేసినట్లయితే, క్రమక్రమంగా మనసు శివుని యందు స్థిరంగా ఉండడానికి అలవాటు పడుతుంది. ఏ పనిలో ఉన్నా ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఈశ్వరుని తలచినట్లయితే, మన మనసు క్రమక్రమంగా ఈశ్వరుని తలుచుకోవడానికి అలవాటు పడుతుంది. అప్పుడు మనం చేసే సాధనకు అవాంతరం కలగదు. క్రమక్రమంగా ఈ సాధన ద్వారా అనంత అమృత ఆనంద సాగరమైన మోక్షాన్ని అందుకోగలుగుతాము.
0 కామెంట్‌లు