★★★ఆత్మబోధ సారం-1 చదివిన తరువాత ఆత్మబోధ సారం-2 చదవగలరు.★★★
●●●మనము ఇప్పటివరకు ధాన్యపు గింజ చుట్టూ పొట్టు ఏ విధముగా కప్పబడి ఉందో, అదేవిధంగా ఆత్మకు పంచకోశాలు కప్పబడి ఉంటాయి. ఈ పంచ కోశాలను వేరు చేసినట్లు అయితే ఆత్మ వేరు అవుతుంది అని వివరించుకున్నాము. కానీ ఇది పెద్ద దోషము. నిజంగా ఆత్మ అనేది వేరుగా ఉన్నట్లయితే, ఆత్మకు పరిచ్చినత(limitations) వచ్చినట్లే కదా! ఆత్మ చుట్టూ పంచకోశాలు కప్ప బడి లేదు. అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఆత్మ అంతటా వ్యాపించి ఉంటే ఆత్మకు విలక్షణత వచ్చినట్లే కదా! మరి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ అన్నమయకోశంలోనూ ఉంది, ప్రాణమయ కోశం లోనూ ఉంది, మనోమయ కోశం లోనూ ఉంది, విజ్ఞానమయ కోశం లోనూ ఉంది, ఆనందమయ కోశం లోనూ ఉంది. కానీ అన్న మయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఆత్మ కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న ఈ పంచ కోశాలు ఆత్మ అంటున్నారు. మరలా ఆత్మ పంచకోశాలు కాదు అంటున్నారు. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన అమ్మవారు మంత్రం ఉంది అది ఏమిటంటే "తత్వాసన తత్వమయి పంచకోశాoతరెస్టీతాం" అంటే తత్వమే ఆసనంగా కలిగి ఉంది తత్వమే ఆవిడ అయి ఉంది పంచకోశాలలోను అమ్మవారు అయి ఉంది కానీ అన్నమయ
ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అమ్మవారు కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి నాటకంలో ఒక వేషం ధరించాడు. అది స్త్రీ వేషం. తర్వాత అదే వ్యక్తి అదే నాటకంలో నపుంసకుడి వేషం ధరించాడు. ఇప్పుడు ఆ నాటకంలో ఉన్నా స్త్రీ పురుషుడే. నపుంసకుడు కూడా పురుషుడే. కానీ ఆ పురుషుడు స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. అదేవిధంగా ఆత్మ కూడా అంతే.
ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఉద్యోగరీత్యా వేరే ఊరు నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్య ఎదురు వచ్చి నవ్వుతూ ఎలా ఉన్నారు అని
పలకరించింది. తరువాత అతని కొడుకు నాన్న అని దగ్గరకు వచ్చాడు. తర్వాత అతని తల్లి నాయనా ఎప్పుడు వచ్చినావ్ రా అని పలకరించింది. అతను తల్లితో ఇప్పుడే వచ్చేనమ్మా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని పలకరించాడు. కొడుకును దగ్గర తీసుకుని ముద్దాడాడు. భార్యని ప్రేమగా పలకరించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తల్లికి కొడుకు. భార్యకి భర్త. కొడుక్కి తండ్రి. ఆ ఒక్క వ్యక్తి తండ్రి గా ఉన్నాడు, కొడుకు గా ఉన్నాడు, భర్త గా ఉన్నాడు, అంటే తండ్రి ఆ వ్యక్తే. కొడుకు ఆ వ్యక్తే. భర్త ఆ వ్యక్ట్. ఇప్పుడు అతని తల్లి చనిపోతే, కొడుకుగా ఉండడు గానీ, తండ్రిగా భర్తగా ఉంటాడు. భార్య చనిపోతే కొడుకుగా తండ్రిగా ఉంటాడు. ఎవరు పోయిన అతను ఉంటాడు. అతను అంటూ లేకపోతే తండ్రి లేడు, కొడుకు లేడు, భర్త లేడు. అదేవిధంగా ఈ పంచ కోశాలలో ఏవి లేకున్నా ఆత్మ మాత్రం ఉంటుంది. కానీ ఆత్మకు విఘాతం కలిగితే ఇవేమి ఉండవు. జగత్తులో ఏది నశించినా ఆత్మ మాత్రం ఉంటుంది. ఆత్మ అనేది లేకపోతే, అసలు ఈ జగత్తు లేదు. ఆత్మ నిరాకారః, నిర్గునః,నిరావయః ఆత్మకు రూపం లేదు గుణమూ లేదు. అదే కనుక ఆత్మకు రూపము గుణము ఉన్నట్లయితే, మన శాస్త్రవేత్తలు ఆత్మను ఎప్పుడో కనిపెట్టి ఉండేవాళ్ళు. అసలు ఉన్నదే ఆత్మ మాత్రమే. జగత్తు లేదు జీవులు లేవు. అందుకే శంకరాచార్యులవారు "బ్రహ్మసత్యం జగత్తు మిథ్య" అన్నారు. మిథ్య అంటే లేదు అని అర్థం కాదు. మిథ్య అంటే లేదు అని అర్థానికి వచ్చేస్తారు. కానీ శంకరాచార్యులవారు ఎప్పుడు లేదు అని చెప్పలేదు. జగత్తు ఉంది కానీ కల్పితము. మిథ్య అంటే కల్పితము. శంకరాచార్యులవారు ఒకనాడు ఉండి ఒకనాడు నశించే వాటి కోసం కాకుండా నిత్యం వుండే ఆత్మను పట్టుకోమన్నారు. ఇదంతా బాగానే ఉంది, ఆత్మకు రూపం గుణం లేదు. మరి ఆత్మను ఎలా తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. వివేకంతో మాత్రమే ఆత్మను ఎరుకలోకి తెచ్చుకో గలము. వివేకం అన్నది బుద్ధి లో మాత్రమే ఉంటుంది. బుద్ధిని బాగా పదును పెట్టి విచారణ చేయగా చేయగా ఆత్మను తెలుసుకో గలుగుతాము. ఉదాహరణకు ఎక్కడైనా దుర్గంధం కలిగితే, మన కళ్ళు దుర్గంధాన్ని పసి కట్టలేదు. చేతులు కాళ్లు మొదలైన ఏ అవయవాలు దుర్గంధాన్ని పసి కట్టలేదు., ఒక నాసికం మాత్రమే ఘ్రణ శక్తి ద్వారా పసిగడుతుంది. అదేవిధంగా బుద్ధి మాత్రమే ఆత్మను వివేకంతో తెలుసుకో గలుగుతుంది. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్న ప్పుడు, దేహేంద్రియ మనోబుద్ధులలో ఈ ఆత్మచైతన్యం ఉంటుంది. అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు జడములే. ఆత్మచైతన్యం వలన వాటికి చేతనము కలుగుతున్నది. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని నుండి శక్తిని గ్రహించి ఈ ప్రకృతి అంతా మేల్కొని చేతనత్వాన్ని కలిగి ఉంటుందో, అదే విధముగా ఆత్మ చైతన్యము వలన దేహేంద్రియ మనో బుద్ధులు చేతనత్వాన్ని కలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఆత్మచైతన్యం వలన వేతనము కలిగి కర్మలు చేస్తున్నాయి. అలాంటప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు చేసే కర్మలకు కారణం ఆత్మే కదా అన్నది ప్రశ్న. దేహేంద్రియ మనోబుద్ధులు చేసే కర్మలకు ఆత్మ ఆరోపితము కాదు. ఎందుకంటే మనము నిద్రలో ఉన్నప్పుడు, మన దేహము ఆచేతనముగా మారి, జడత్వాన్ని కలిగి ఉంటుంది. మనోబుద్దులు కొంతసేపు స్వప్న ప్రపంచం లో విహరించి పడిపోతుంది. ఆ తర్వాత మనం గాఢనిద్రలో చేరుకుంటాం దీనినే 'సుఘుప్తి' అంటారు నిద్ర లేచిన తరువాత ఎలా ఉంది అంటే హాయిగా ఉంది అంటారు. అంటే గాఢనిద్రలో ఏమీ తెలియని వాడు గా పడి ఉన్నాము. ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మనకు ఏమీ తెలియదు. అన్నిటినీ వదిలేసి ఒక్కడిగా హాయిగా ఉన్నాము. ఏమీ తెలియని వాడిగా పడి ఉన్న మనము ఉదయాన్నే హాయిగా నిద్ర పోయాను అని అంటున్నాం. అంటే ఆ హాయిని గుర్తించింది ఎవరు? గాఢనిద్రలో దేహేంద్రియ మనోబుద్ధులు ఆచేతనమై దేనిని గుర్తించలేని పరిస్థితుల్లో ఉండిపోతాయి. ఆ సమయంలో ఈ హాయిని గుర్తించే వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడు? వాడు ఉదయాన ఈ ఆత్మ యొక్క చైతన్యంతో దేహేంద్రియ మనోబుద్ధులను మేల్కొలుపు తున్నాడు. ఆత్మ కేవలం సాక్షి భూతమై ఉంటుంది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కర్మలను చేయిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. ఆది శంకరాచార్యులవారు వాడిని పట్టుకుంటే ఆత్మ స్వరూపం అవగతమవుతుంది అని చెబుతారు. ఉదయాన నిద్ర లేవగానే మొట్టమొదటగా 'నేను' అనే తలంపు మొలకెత్తి అది ఇంద్రియ మనో బుద్ధులను ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది. శాస్త్రం ఈ నేను అనే వాడిని పట్టుకుంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అని చెబుతుంది. ఒక అగ్గిపెట్టలో ఉన్న ఒక అగ్గిపుల్ల లో అగ్ని అంతర్గతంగా ఉంది. అగ్గిపుల్లను అగ్గిపెట్ట పై గీసినపుడు అగ్గిపుల్ల మండి అన్నిటినీ అనగా దీపాలను వంట పొయ్యను కట్టెలను ఎలా వెలిగిస్తుందో, అదేవిధంగా నేను అన్న వాడు ఆత్మ చైతన్యం చేత దేహేంద్రియ మనోబుద్ధులకు చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. నేను అనునది మనలోని అంతర్ముఖంగా ఉండే 'అహం' అనే స్పందన. ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షుల వారు "హృదయకుహరముల మద్యే అహం అహం అనుష్టితాం" అని అన్నారు. అంటే హృదయ కుహరముల మధ్య నేను,నేను అని స్పదించే ఒక స్పందన ఉంది. మనలో అంతర్ముఖంగా లోపల ఎక్కడో అహం అహం, అహం అని స్పందించే దానిని మనం పట్టుకోవాలి. దానిని పట్టుకున్నట్లు అయితే, ఆత్మను తెలుసుకునే దారి దొరుకతుంది. ఆత్మ అనునది సత్. సత్ అంటే ఎప్పటికీ ఉండేది. జగత్తులో ఏదైనా ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు ఒకప్పుడు కనబడుతుంది ఒకప్పుడు కనపడదు ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉండే ఆత్మ స్వరూపాన్ని పొందాలంటే, బహిర్ముఖంగా ప్రయాణించకుండా అంతర్ముఖంగా ప్రయాణం చేసి 'అహం' అనే 'సొం' పదం యొక్క స్పందనను పట్టుకోవాలి. భాగవతంలో పోతన గారు "లోకంబులు లోకేశులు లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం జీఁకటి కవ్వలనెవ్వం డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్" అని వివరించారు. ఈ పంచ కోశాలను అన్నిటినీ దాటుకుంటూ అంతర్ముఖంగా విచారణ చేసినట్లయితే రెండు వృత్తులు తెలియ పడతాయి. ఆ రెండు వృత్తులు ఏమిటంటే అహం వృత్తి, ఇదం వృత్తి. అహం వృత్తి అంటే నేను నేను అనే స్పందన. ఇదం వృత్తి అంటే అది ఇది అనే స్పందన. ఈ అహం అనే స్పందన వలన ఇది నాది, అది నీది, నా తల్లిదండ్రులు, భార్య ,భర్త ,పిల్లలు, సంసారం మొదలైన గందరగోళాలు. ఈ నేను అనే వాడికి ఒక శరీరం ఉంది ఆ శరీరమే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఉండటం వలన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపమే. సత్ అంటే ఎప్పటికీ ఉండేది. శాశ్వతంగా ఉండేది. ఇది అంతా నిర్వికృతమై ఉండేది. చిత్ అంటే అంతా తెలియబడినది. ఎప్పటికీ ఆనందంగా ఉండే స్వరూపము. ఈ సచ్చిదానంద స్వరూపం యొక్క చైతన్యం చేత ప్రకాశం పొంది, చైతన్యం చెంది 'నేను' అనే వాడు ఉదయాన లేస్తున్నాడు రాత్రి పడిపోతున్నాడు. అసలు ఈ నేను అనే వాడు ఎక్కడ ఉంటాడు అన్నది ప్రశ్న. ఈ అన్నమయ దేహం జడం. ప్రాణం లోపలకి బయటికి తిరుగుతూ ఉంటుంది. మనసు రూప వృత్తులను సృష్టించుకొని స్వప్న ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. వీటిలో నేను అనే స్పందన ఉండే అవకాశం లేదు. మరి 'నేను' అనేవాడు ఎక్కడ ఉంటాడు? నేను అనే వాడు బుద్ధిలో మాత్రమే ఉంటాడు. బుద్దే నేను అనే వాడి యొక్క నివాసము. నేను అనే వాడి యొక్క నివాసం బుద్ధి అయితే నేను అనే వాడు ఎలా వచ్చాడు? నేను అనే వాడు ఎక్కడనుంచో రాలేదు. ఈ నేను అన్నది ఆత్మ యొక్క ప్రతిబింబం. ఈ ఆత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే 'నేను'. బుద్ధి ప్రతిబింబ స్థానము. బుద్ధి ప్రతిబింబించడం వలన ఈ 'నేను' అనే స్పందన కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే నేను. అద్దం మీద మన ముఖం ఏ విధంగా అయితే ప్రతిబింబిస్తుందో, అదే విధంగా శుద్ధ చైతన్యంగల ఆత్మ యొక్క ప్రతిబింబం బుద్దిలో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబమే 'అహం' అని స్పందించే జీవుడు. నేను అనే జీవుడికి అజ్ఞానం ఉండటం వలన తన స్వరూపాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అందువలన మనసు నేను, ప్రాణము నేను, దేహము నేను అనే భావనతో ప్రపంచంలో తిరుగుతున్నాడు. అన్నిటినీ తన నెత్తిన పెట్టుకుని సుఖదుఃఖాలను పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఎవరికి కావాలి? ఈ నేను అన్న వాడికి జ్ఞానము కావాలి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, అప్పుడు తన యొక్క నిజ స్వరూపం తెలియ పడుతుంది. నేను మనసు కాను, ప్రాణమును కాను, దేహమును కాను. నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అని తెలియ బడుతుంది. అందుకే గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. గురువు శాస్త్రం ద్వారా మనకు జ్ఞానం కలిగిస్తాడు. గురువు జ్ఞాన ప్రమాణాన్ని మాత్రమే తెలియజేస్తాడు. తర్వాత సాధన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మరి ఈ పూజలు, యాగాలు, జపాలు, తీర్థయాత్రలు, దానధర్మాలు ఇవన్నీ ఎందుకు అని ఒక ప్రశ్న. ఈ పూజలు, జపాలు, దానధర్మాలు ఇవన్నీ కర్మలు మాత్రమే. కానీ ఈ కర్మలన్నీ ఎంతో ముఖ్యమైనవి. ఈ కర్మలు శరీరం వరకు, మనసు వరకు మాత్రమే. ఈ కర్మలు అంతఃకారణాలను శుద్ధి చేసుకోవడానికి దేహేంద్రియ మనోబుద్ధులకు పవిత్రత చేసుకోవడానికి సహకరిస్తాయి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు శుద్ధి అయి పవిత్రంగా మారటం వలన జ్ఞానం బుద్ధిలో నిలబడుతుంది. జ్ఞానం వలన భ్రమలు భ్రాంతి అన్ని తొలగిపోయి ఆత్మ స్వరూపం అవగతమవుతుంది. ఇది గురువు యొక్క సానిధ్యంలో ఉండి గురువు యొక్క వాక్యాలను అంతఃకరణ శుద్ధి తో విని సాధన చేయడం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. ఏ విధంగా అంటే ఒక వ్యక్తి చీకటిలో తాడును చూసి పాముగా భ్రమ పడతాడు. భయపడతాడు కదలని వాడుగా ఉండిపోతాడు. అప్పుడు ఒక వ్యక్తి దీపంతో అక్కడికి రాగానే ఆ దీపం యొక్క ప్రకాశం వలన అక్కడ ఉన్నది పాము కాదు తాడు మాత్రమే అని అవగతమవుతుంది. దీపం తో వచ్చిన వ్యక్తి గురువు. ఆ దీపం శాస్త్రము. గురువు శాస్త్రం ద్వారా జ్ఞానమనే ప్రకాశాన్ని మనకు అందిస్తాడు. చీకటిలో ఆ తాడును చూసిన నేత్రాలు సర్పం అనే బ్రమను పొందాయి. నేత్రాలు తాడును గుర్తించే స్థితిలో ఉన్న , మనసు మాత్రం సర్పం అనే బ్రమను కలిగించాయి. అదే విధముగా ఈ నేను అనే వాడు తన స్వరూపాన్ని గుర్తించలేక నేను జీవుడిని. దేహేంద్రియ మనోబుద్ధులు అన్నీ నేనే. నేను ఇందు లోనే ఉన్నాను. అనే బ్రాంతితో అన్నింటిని పెనవేసుకుని లేస్తున్నాడు. వ్యవహారం చేస్తున్నాడు. పడిపోతున్నాడు. నేను అనే వాడు లేస్తే వాడితో పాటు దేహము ఇంద్రియాలు మనసు లేస్తూన్నాయి.వాడు పడిపోతే అవి పడిపోతున్నాయి. ఈ సంసార దుఃఖాలకు మూలం అజ్ఞానం. ఈ అజ్ఞానం వలన ఈ నేను అనేవాడు పుడుతున్నాడు, వ్యవహారం చేస్తున్నాడు, చనిపోతున్నాడు. మళ్ళీ పుడుతున్నాడు, చనిపోయాడు. "పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం" మరి జగత్తులో ఎన్నో జీవులు ఉన్నాయి ఎన్నో దేహాలు ఉన్నాయి ఇవన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయి? ఎన్నో దేహాలు ఉన్నప్పుడు వీటన్నిటికీ ఆత్మలు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఆత్మ అన్నది కేవలం ఒక్కటే. ఆత్మ స్వప్రకాశం. దేహాలకు ప్రకాశం లేదు. అవి స్వయం ప్రకాశాలు కావు. ఆత్మ యొక్క స్వయం ప్రకాశం చేత, సమస్తము ప్రకాశిస్తున్నాయి. ఒక చీకటి గదిలో పది మంది వ్యక్తులు ఉన్నారు. జంతువులు ఉన్నాయి. మరల కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఆ చీకటి గదిలోకి ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, ఆ దీపం యొక్క ప్రకాశం చేత ఆ గదిలో ఉన్న వ్యక్తులు, జంతువులు, వస్తువులు అన్ని ప్రకాశం చెంది కనబడుతున్నాయి. ఒక దీపకాంతి వలన చీకటి గదిలో ఉన్న అన్ని కనబడుతున్నాయి. అదే విధముగా ఆత్మ యొక్క ప్రకాశం చేత సమస్తము ప్రకాశిస్తున్నాయి. ఈ జగత్తు కల్పితము. ఈ సృష్టి కల్పన, కల్పితము. యదార్ధమునకు ఆత్మ మాత్రమే శాశ్వతము, శుద్ధ ప్రకాశము. నిత్య చైతన్యము. దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క వ్యవహార కర్మలకు ఆత్మ ఆరోపితము కాదు. ఆత్మకు కర్తృత్వము లేదు. స్వప్రకాశము, నిత్యచైతన్యము. సూర్యుడు ప్రకృతిలోని సమస్త జీవులకు తన ప్రకాశాన్ని అందించాలని ప్రకాశించడం లేదు.సురుడు స్వప్రకాశము.ఎటువంటి కర్తృత్వము లేదు. అదే విధముగా ఆత్మకు కర్తృత్వము లేదు. ఆత్మ యొక్క సొంత చైతన్యంతోనే జ్ఞానేంద్రియ మనోబుద్దులు ప్రకాశిస్తున్నాయి. అయితే ఆత్మ యొక్క స్వరూపం ఎరుకలోకి రావాలంటే, జ్ఞానం అవసరం అవుతుందా అన్నది ప్రశ్న . ఆత్మ జ్ఞానస్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఆత్మకు జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ పరోక్షంగా తెలియ బడుతూనే ఉంది. అది ఎలా అంటే ఉదయం నిద్ర లేవగానే అహం, అహం అనే స్మరణ మనకు తెలియ బడుతూనే ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఒక చీకటి గదిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చీకటిలో ఏమీ కనిపించడం లేదు. ఆ వ్యక్తిని కనుక మనం చీకటిలో ఎలా ఉంది అని అడిగితే, ఏమోనండీ నాకు ఏమీ తెలియడం లేదండి అంటాడు. మరి నువ్వు ఉన్నావా? అంటే నేను ఉన్నానండి కానీ, నాకు ఏమీ అర్థం కావడం లేదండి ఏమీ తెలియడం లేదండి అని అంటాడు. అంటే అతనికి తను ఉన్నాను అని తెలుసు కానీ ఏమీ తెలియడం లేదు అని అంటున్నాడు. అంటే అతడు చీకటిలో ఉండటం వలన ఏమీ తెలియడం లేదు అని అంటున్నాడు. అదేవిధంగా అహం, అహం అని నిత్యం స్ప్రురించే జీవుడికి తన స్వరూపం తెలియక అజ్ఞానమనే చీకటిలో ఉన్నాడు. అందుకే జ్ఞానం అనేది అజ్ఞానంలో ఉన్న జీవుడికి మాత్రమే. ఆత్మకు ఎటువంటి జ్ఞానము అవసరం లేదు. శంకరాచార్యులవారు చెప్పినట్లుగా "న దీపచ్చ అన్య దీప ఇచ్చా". అంటే అఖండంగా వెలుగుతున్న దీపం వద్దకు చిరు దీపాన్ని వెలిగించి నట్లయితే ఆ చిరు దీపం ,ఏలాగైతే నిర్వీర్యం అవుతుందో, అదే విధముగా అఖండ జ్ఞాన స్వరూపమైన శుద్ధమైన ఆత్మ వద్ద జ్ఞానమనే ప్రకాశం నిర్వీర్యమవుతుంది. అందువలన ఆత్మకు జ్ఞానం అవసరం లేదు. కేవలం అజ్ఞానంతో బుద్ధిలో ప్రతిబింబిస్తున్న జీవుడికి మాత్రమే. అయితే జ్ఞానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న జ్ఞానమంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే పరమాత్మ జీవాత్మ వేరు కాదు ఒకటే అని అవగతం కావడం. ఇది అవగతం అవ్వాలంటే ఆత్మ విచారణ చేయాలి. ఆత్మ బోధ, తత్వ బోధ తెలుసుకోవాలి. ఉపనిషత్తుల యొక్క సారాన్ని గ్రహించాలి. దేహేంద్రియ మనోబుద్ధులు అనే ఉపాదులను తొలగించి అహం అని స్ప్రురించే జీవత్వం దగ్గరకు చేరి, ఆ జీవత్వాని కూడా తొలగించి, శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని పొందటాని జ్ఞానం అంటారు. మరి ఈ జ్ఞానాన్ని పొందటం ఎలా అని ఒక ప్రశ్న. జ్ఞానాన్ని పొందాలంటే "తత్వమసి" అనే మహా వాక్యాన్ని శ్రవణ, మనన, నిదిబ్యాసన చేయాలి. అసలు తత్వమసి అంటే తత్-స్వo-అస్థి. తత్ అంటే ఆత్మ స్వo అంటే నీవు అస్థి అంటే అయి ఉన్నావు. అది నీవై ఉన్నావు. నీవు శుద్ధమైన ఆత్మవై ఉన్నావు. మరి ఈ తత్వమసి జ్ఞానం ఎలా కలుగుతుంది? ఈ జ్ఞానం కలగాలంటే గురువు యొక్క సన్నిధి చాలా అవసరం. గురు సన్నిధిలో శ్రవణం చేసి మననం చేయాలి. అప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు అన్ని కేవలం ఉపాధులు మాత్రమే అని అవగతమై, 'అహం' అనే జీవత్వం తొలిగిపోయి, ఆత్మస్వరూపంగా మిగిలిపోతాడు. అన్ని ఉపాధుల లో తన స్వరూపాన్ని మాత్రమే చూడగలుగుతాడు. నేను, నేను అనబడే జీవుడు ఇక ఉండడు. అంతటా బానే ఉన్నాను అనే స్థితికి చేరగలుగుతాడు. కర్మ బంధనాలు అన్ని తొలగిపోతాయి. అది ఏ విధంగా అంటే ఒక సన్యాసి ఉన్నాడు. అతను ప్రతిరోజు బిక్ష కు వెళ్లి భగవత్ చింతన తో కాలం గడుపుతున్నాడు. కొంతమంది ఆ సన్యాసి కి ధనాన్ని కూడా ఇచ్చేవారు. ఆ సన్యాసి కి ధనంతో అవసరం లేదు కాబట్టి ధనాన్ని బ్యాంకులో ఉంచేవాడు. కొంతకాలానికి ఆ సన్యాసి కాలం చేశాడు. ఆ సన్యాసి కి నామిని లేదు. ఇప్పుడు ఆ బ్యాంకు లో ఉన్న ధనం ఏమవుతుంది? అదేవిధంగా జ్ఞానం కలిగిన వ్యక్తి జీవ భావాన్ని తొలగి, దేహేంద్రియ మనోబుద్ధులు చేసే కర్మలకు బందీ కాకుండా తన నిజమైన స్వరూపంతో నిలబడిన వాడి యొక్క కర్మలు దహించి వేయబడతాయి. అతను యొక్క కర్మల యొక్క ఖాతా మహా ఖాతా లోకి చేరిపోతాయి. శ్రవణం అంటే ఏది పడితే అది శ్రవణం చేయడం కాదు. వేదం నిర్దేశించిన వ్యాఖ్యలను మాత్రమే శ్రవణం చేయాలి. జీవ బ్రహ్మ ఐక్యత్వాని వివరించే వ్యాఖ్యలను మాత్రమే శ్రవణం చేయాలి. తదుపరి శ్రవణం చేసిన వ్యాఖ్యలను మానసికంగా విచారణ చేయాలి. నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, మనసును కాదు అని మనసులో, లోలోపల దృఢమైన విచారణ చేయాలి. అప్పుడు ఈ దేహం ఇంద్రియ మనో బుద్ధులు నీటి బుడగలు లాంటివి. ఈ బుడగలు పుట్టి కొంతసేపు జలం లో ఉండి తర్వాత పగిలిపోతాయి. ఈ బుడగలకు అధిష్టానం జలం మాత్రమే. అదేవిధంగా ఈ దేహము పుట్టి వృద్ధి చెంది తరువాత క్షీణించి మరణిస్తుంది. కానీ ఈ దేహానికి అధిష్టానం ఆత్మ మాత్రమే. ఆత్మ శాశ్వతము. ఆత్మకు చావు పుట్టుకలు ఉండవు. కేవలం దేహేంద్రియ మనోబుద్ధులకు మాత్రమే జనన మరణ చట్రాలు ఉంటాయి. ఆత్మకు ఈ జనన మరణాల చట్రాలు ఉండవు. దేహేంద్రియా మనోబుద్దులను పట్టుకుని జీవత్వా భావాన్ని కలిగి ఉన్నట్లయితే, జన్మ చట్రంలో ఇరుక్కోవలసిందే. మరి ఆత్మ అనేది ఎలా ఉంటుంది? అన్నది ఒక ప్రశ్న. ఆది శంకరాచార్యులవారు ఆత్మ గురించి ఈ విధముగా వర్ణించారు. నిర్గునః, నిష్క్రియః, నిత్యహ, నిర్వికల్పనః, నిరంజనః,నిర్వికారః, నిరాకారః, నిత్యముక్తః,నిర్మాలహా. బుద్ధికి ఉన్న గుణాలు ఆత్మకు ఉండవు. కాబట్టి ఆత్మ నిర్గుణమైనది. దేహము చేసే క్రియలు ఆత్మకుకు ఉండదు. కాబట్టి ఆత్మ నిష్క్రియము. జాగృత,స్వప్న,సుఘుప్తిలలో ఆత్మ వుంటుంది. కాబట్టి ఆత్మ నిత్యమైనది దేహేంద్రియ మనోబుద్ధులు కల్పనలు. కానీ ఆత్మ నిర్వికల్పన. జాగృత,స్వప్న,సుఘుప్తిలు మార్పులకు లోనవుతుంది. ఎలా అంటే జాగృత స్వప్నంలా ఉండదు. స్వప్నావస్థ జాగృదావస్తాలా ఉండదు. కానీ ఆత్మ ఒకేలా ఉంటుంది. అందుకే ఆత్మ నిరంజనము. దేహేంద్రియ మనోబుద్ధులు వికారాలు చెందుతుంది. ఆత్మ మాత్రం వికారాలు చెందదు కాబట్టి ఆత్మ నిర్వికారము. దేహానికి ఆకారం ఉంటుంది. కానీ ఆత్మకు ఎటువంటి ఆకారం ఉండదు. అందుకే ఆత్మ నిరాకారము. అంతేకాకుండా ఆత్మ ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే ఆత్మ నిత్య ముక్తము. ఆత్మ ఆనంద స్వరూపం గా ఉంటుంది. అందుకే ఆత్మ నిర్మలము. అంతేకాకుండా ఆత్మ సదా,సర్వ, సమ,సిద్ద,నిత్య,శుద్ధ,ముక్త, ఏక,అఖండ,ఆనంద,అద్వైతమ్. "నిత్యా శుద్ధ ముక్తా ఆత్మ". "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ". నిత్య అంటే ఎప్పుడూ ఉండేది. అది సత్యం. శుద్ధ అంటే పరిపూర్ణంగా ఉండేది. అంటే జ్ఞానం. ముక్తా అంటే ఎల్లవేళలా ఎల్లప్పుడు అంతర్ముఖంగా బహిర్ముఖంగా ఉండేది. అంటే అనంతంగా వుండే ఈ ఆత్మే బ్రహ్మ. శ్రావణం మననం తర్వాత నిదివ్యాసనా చేయాలి. నిదిబ్యాసన అంటే ఏకాంతంగా విరాగిగా విచారణ చేయాలి. విచారణ చేయటం అంటే అంతర్ముఖంగా అన్నిటి పట్ల ఆపేక్ష వదిలి బ్రర్మాత్మ గురించి విచారణ చేయటం. ఏకాంతంగా అంటే అన్నిటిని వదిలేసి దూరంగా వెళ్ళటం కాదు. మన ముందు ఎన్ని నామరూపాలు ఉన్నా ఏకాంత భావనను కలిగి ఉండటం. మనం చేసే ప్రతిక్రియలోను, కర్మలోను ఆత్మస్వరూపాన్ని చూడటం. చేసే ప్రతి కర్మ వివేక పూరితమైన కర్మ అయి ఉండాలి. ఆవివేక పూరితమైన కర్మలు ఉండకూడదు. కళ్ళు బంగారపు ఉంగరాన్ని చూస్తాయి. కానీ నీ బుద్ధి మాత్రం బంగారాన్ని చూస్తుంది. ఉంగరం యదార్థానికి బంగారమే. దృష్టి నామ రూపమైన ఉంగరాన్ని చూస్తుంది. బుద్ధి మాత్రం ఆ ఉంగరం యొక్క యధార్థ రూపమైన బంగారాన్ని గ్రహిస్తుంది. అదేవిధంగా నామరూపాలు ఎన్నిటిని చూసిన వాటిలో ఉన్న అసలు స్వరూపమైన ఆత్మను గ్రహించాలి. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతటినీ ఆత్మ స్వరూపం గా గ్రహించగలగాలి. ఇది నిదిబ్యాసన వలన సాధ్యమవుతుంది. ఈ నిదిబ్యాసన వలన ఆవిద్య తొలగిపోతుంది. ఆవిద్య అంటే అజ్ఞానం. ఈ అవిద్య మూడు గుణాలను కలిగి ఉంటుంది. అవి మలం, విక్షేపము,అవరణము. మలం అంటే దోషము.రాగద్వేష దోషం కలిగి ఉండటమే మలం అంటారు. విక్షేపము అంటే నేను,నాది అనే భావముతో నానాత్వాని కలిగి వుండటం. అవరణము అంటే కర్తృత్వ,భోకృత్వా భావాన్ని కలిగి నేను జీవుడిని అని అనుకుని అవివేకతో కలిగి వుండటం. ఈ మూడు గుణాలు కలిగిన ఆవిద్య నశిస్తుంది ఏ కర్మ చేసిన ఏ క్రియ చేసిన దృశ్యమాన జగత్తులో ఏ నామ రూపాలను చూసిన కర్తృత్వ , భోక్తృత్వ భావన లేకుండా ఆత్మ స్వరూపాన్ని మాత్రమే గ్రహించే స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ మిగిలేది చిదానంద స్వరూపం. ద్యేయా,జ్ఞాత, జ్ఞాన వృత్తులు పడిపోయినప్పుడు మిగిలిన స్వరూపమే చిదానంద రూపం. కళ్ళు మూసుకున్నప్పుడు కనపడే నామ రూపాన్ని ద్యేయ అంటారు. ఆ నామ రూపాన్ని చూసేవాడిని జ్ఞాత అంటారు ద్యేయా,జ్ఞాతలను కలిపెదానిని జ్ఞానం అంటారు. ద్యేయరూపాలు మారుతుంటాయి.తరువాత ద్యేయా రూపం పడిపోతుంది.తర్వాత జ్ఞాత పడిపోతుంది జ్ఞానము పడిపోతుంది. అప్పుడు మిగిలే స్వరూపమే ఆత్మస్వరూపం. మనసులో కలిగే ఆలోచనలే ద్యేయా,జ్ఞాత వృత్తులు. చూడబడేది ద్యేయవృతి. చూసేది జ్ఞాతవృత్తి. ఈ రెండు వృత్తులను అనుసంధానం చేసేది జ్ఞానవృత్తి. ఈ మూడు మనసులో పుట్టే వృత్తులు. ద్యేయా అనునది నామరూపవృతి. జ్ఞాత అనునది చూసేవాడు. వాడే 'నేను' అని స్పందించే జీవుడు. ఈ మూడు వృత్తులు నిద్రలో పడిపోతాయి. అప్పుడు మిగిలేది శుద్ధమైన ఆత్మ స్వరూపం. నిద్ర అనునది కేవలం ఉపమానం మాత్రమే. నిద్రలో లభించే, ఆనంద రూపాన్ని మెలుకువగా ఉన్నప్పుడు, ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవించగలగడమే నిదిబ్యాస సాధన. ఇప్పుడు ఆ సాధన ఎలా చేయాలి అన్నది ప్రశ్న. ఆది శంకరాచార్యులవారు ఈ సాధన ఎలా చేయాలో అద్భుతంగా వివరించారు. యజ్ఞం చేసినప్పుడు, అగ్నిని వెలిగించడానికి ఒక ప్రక్రియను చేసేవారు. నేల మీద ఒక చెక్క ఉంచేవారు. ఆ చెక్కను ఆరని అంటారు. ఆ చెక్క మధ్యలో చిన్న రంద్రం పెట్టి, ఆ రంధ్రంలో కవ్వం లాగా ఒక కర్రను ఉంచి, ఆ కర్ర పైన వేరొక ఆరనిని అనగా చెక్కను ఉంచేవారు. తరువాత తాడు సహాయంతో కవ్వాని చిలికే వారు. దీనిని 'అగ్నిమధనం' అంటారు. అందులో నుండి నిప్పురవ్వ వచ్చినప్పుడు, పీచును ఉంచేవారు. ఆ పీచు మండిన తరువాత కర్పూర ఉంచి అగ్నినీ రగిలించి యజ్ఞాన్ని మండించి యాగాన్ని ప్రారంభించేవారు. ఈ ప్రక్రియను 'కర్మయాగము' అంటారు. ఇదేవిధంగా "జ్ఞానయాగము" చేయాలి. అంటే కింద ఉంచే చెక్క స్థానంలో మనో బుద్ధులను ఉంచాలి. మధ్యన ఉన్న కర్ర అనగా కవ్వము నేను అనబడే జీవుడు పైన ఉన్న చెక్క ప్రణవము. ప్రణవము అనగా ఓంకారము. ఇప్పుడు ఓంకార సహాయంతో మనో బుద్ధులను చిలకాలి. అంటే ఓంకార జపాన్ని నిత్యం చేస్తూ ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే యజ్ఞంలో అగ్ని మథనం చేసినప్పుడు నిప్పురవ్వ ఎలా అయితే బయట పడుతుందో, అదేవిధంగా ఆత్మానుభవం కలిగినంతవరకు ఆపకుండా సాధన చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియను జ్ఞాన మధనం అంటారు. ఈ ప్రక్రియ వలన ఆత్మానుభవం ఎలా కలుగుతుంది? అన్నది ప్రశ్న. అకార, మకార, ఉకారాలు ఓంకారము. ఓం అని ఉచ్చరించినపుడు, ఆ ఉచ్ఛరణలో చివర నిశ్శబ్దం ఏర్పడుతుంది. అదియే ఆత్మానుభవం. ఇలా సాధన చేయగా, చేయగా ఆత్మలో ఏకమవుతాము. ఏ విధముగా అయితే ఉప్పు సముద్రం లోతును తెలుసుకోవాలని సముద్రంలోకి అడుగు పెడితే, ఆ ఉప్పు సముద్రంలో కలిసిపోయి ఏకం అవుతుందో, అదేవిధంగా ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, మనం కూడా ఆత్మలో ఏకం అవుతాము. ఎందుకంటే మనం ఆత్మ స్వరూపమే. సచ్చిదానంద స్వరూపమే. వెలుగు వచ్చినప్పుడు, గదిలో చీకటి తన ఉనికిని కోల్పోతుంది. అంతేగాని ప్రత్యేకంగా చీకటి పోదు. ప్రకాశం లేదు కాబట్టి చీకటి ఏర్పడిందే గాని, నిజానికి చీకటి రావడం లేదు పోవడం లేదు. అదే విధముగా మనము ఆత్మానంద స్వరూపమే. అజ్ఞానం వలన, ఆవిద్య వలన జీవుడుగా తిరుగుతున్నాము. నేను జీవుడిని కాదు ఆత్మని అని అనుకోవడం కూడా అజ్ఞానమే. నేను ఆత్మ స్వరూపాన్ని అన్న సత్యం గ్రహించిన తర్వాత నేను జీవుణ్ణి కాదు నేను ఆత్మ స్వరూపాన్ని అని చెప్పాడా, వాడికి అజ్ఞానం ఉన్నట్లే. ఆత్మస్వసృపం ఎరుకలోకి వచ్చిన తర్వాత నేను జీవుడిని కాదు ఆత్మస్వరూపాన్ని అని చెప్పే అవసరం ఉండదు. అలా చెప్పాడు అంటే అజ్ఞానం అయితే ఇంకా ఉంది పోలేదు. ఇప్పుడు ఆ అజ్ఞానం ఎక్కడ ఉంది అన్నది ప్రశ్న. ఈ అజ్ఞానం బుద్ధిలో ఉంది. అజ్ఞానం అనేది కేవలం బుద్ధిలో మాత్రమే ఉంటుంది. ఆత్మ స్వరూపం అనేది దేహంలోనే ఉంటుంది, మనోబుద్దులు లోను ఉంటుంది, సమస్తం లోను ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే నాకు అజ్ఞానం ఉంది నేను జీవుణ్ణి నేను సాధన చేయాలి ఆత్మను తెలుసుకోవాలి అని అనుకొనేది ఆత్మ స్వరూపమే. దాటేది ఆత్మే, దాటించేది ఆత్మే, దాట బడేది ఆత్మే. సాధన చేసి ఆత్మను గ్రహించే వాడే స్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రశ్న. ఆత్మ విచారణ చేసి సాధన చేసేవాడు యోగిగా ఉంటాడు. యోగి అంటే దేహేంద్రియ మనోబుద్ధులకను దాటి అహం, అహం అని స్పందించే వృత్తి వద్దకు చేరుకుంటాడు. ఆ అహంవృత్తి ద్వారా ఇదం వృత్తులను వదిలి ఆత్మానంద స్వరూపాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాడు. అతనినే యోగి అంటారు. అతను సమస్తాన్ని తనలో చూస్తాడు. తనలో సమస్తాన్ని చూస్తాడు. ఈ నామరూపాలు అన్ని కల్పనలే యథార్థానికి ఆత్మ స్వరూపమే. సమస్తం లోనూ నేను వ్యాపించి ఉన్నాను. పురుషుడు నేనే, స్త్రీ పశుపక్షాదులు నేనే, పంచభూతాలు నేనే అనే స్థితికి చేరుకుంటాడు. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నా ఎన్ని బుడగలు ఉన్నా నురుగు ఉన్నా యదార్థానికి ఇవన్నీ నీరే. అలాగే దృశ్యమానజగత్ అంతా కల్పనలే. వాస్తవానికి అంతటా నేనై ఉన్నాను అనే స్థితికి చేరుకుంటాడు. నిత్య కర్మలను ఆచరిస్తూ ఫలాపేక్ష లేకుండా పాపపుణ్యాల మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. పుణ్యం చేసినట్లయితే, బంగారపు సంకెళ్లు పాపం చేసినట్లయితే, ఇనుప సంకెళ్లు. ఏదైనా జన్మలు అనే చట్రంలో తిరగాల్సిందే. అందుకే అన్నమయ్య తన కీర్తనలో 'పాపపుణ్యములు భారపు పగ్గాలు తెగవు అవి నీవు తెంచక ' అని అంటాడు. సాధన చేసే వ్యక్తికి ఆత్మానుభూతి కలిగినప్పుడు, బయటనుండి వచ్చే సుఖాన్ని ఆశించడు. స్థూల,సూక్ష్మ,కారణశరీరలను వదిలేస్తున్నాడు. రాగద్వేషాలను కోపతాపాలు అన్నిటిని అధిగమిస్తాడు. రాగద్వేషాలు అతనికి ద్వారపాలకులుగా మారతాయి. అవి అతనిలో జీవ భావాన్ని చేరకుండా అడ్డుకుంటాయి. అతను నిర్మలమైన స్థితిలో ప్రశాంతంగా ఉండి తనలో తాను రమిస్తూ నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు. అతని సన్నిధికి ఎవరు చేరిన, అతని యొక్క ప్రకాశం వలన వాళ్లకి ఆ ప్రశాంతత ఆనంద అనుభూతి కలుగుతుంది. అతను ఆకాశము వలే ఉంటాడు. ఆకాశానికి ఏ గుణము ఉండదు.ఆకాశం నిర్గుణము. అందుకే ఆకాశాన్ని ఆత్మకు ఉపమానంగా వాడతారు. గాలి,నీరు,అగ్ని,పృధ్వికి ఎన్ని గుణ దోషాలు ఉన్న అవి ఆకాశానికి అంటవు. అదే విదంగా దేహేద్రియమనోబుద్దులకు ఎన్ని గుణదోషాలు ఉన్న అవి ఆత్మకు అంటవు. మట్టిలో పుట్టిన వికారమే అన్నం. ఈ అన్నం యొక్క వికారమే ఈ దేహం. ఇది మరల మట్టిలో కలిసిపోతుంది. మట్టి నుండి వచ్చింది కనుక మట్టిలో కలిసిపోతుంది. దేహంలోని ప్రాణం పంచీకరణం చెందని మహాప్రాణంలో అంటే మహా పంచభూతాలలో ఉన్న వాయువులో కలిసిపోతుంది. జలం జలంలో కలిసిపోతుంది. మనోబుద్ధులు మహా మనోబుద్దులలో కలిసిపోతాయి. ఇక జీవుడు జ్ఞానంతో బాధింపబడి ఆ జీవుడు పడిపోయాడు. ఇక మిగిలింది ఆత్మస్వరూపమే. బ్రతికుడంగానే ఆ స్థితిని పొంది జీవనముక్తుడు అవుతున్నాడు. దేహేద్రియమనోబుద్దులు ఉన్నా వాటి గుణదోషాలు అతనికి అంటవు. మంచి అయిన, చేదు అయిన అతనికి అంటవు. రాత్రి నిద్రలో పడిపోయి, ఉదయానే లేసి దృశ్యాలన్నింటిని చూసే నేను అనబడే "ద్రష్ట'ను అతడు చూస్తూ ఉంటాడు కాబట్టి 'ద్రష్ట'(నేను) అతనికి దృశ్యంగా మరిపోతాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ద్వైత భావన పోయి అద్వైత స్థితి కి చేరుకుంటాడు. అద్వైతము అంటే రెండు కానిది ఒకటి లేనిది దీనినే అద్వైతము అంటారు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఆది శంకరాచార్యులవారు ప్రతిపాదించారు. అద్వైత స్థితికి చేరుకున్న అతను అఖండమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ ఆనందానికి కొలత పెట్టలేము. ఉపనిషత్తులు మాత్రం ఆ ఆనందానికి కొలతలు ఇచ్చాయి. ఒక మనిషికి ఈ లోకం అంతటినీ పరిపాలించమని ఇచ్చినట్టు అయితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి ఆనందం వంద రెట్లు ఆజానజాన దేవుడి వద్ద ఉంటుంది. ఆనందానికి వందరెట్లు గుణిస్తే ఆ వచ్చే ఆనందం కర్మ దేవుడు వద్ద ఉంటుంది. ఆ ఆనందాన్ని వంద రెట్లు గుణిస్తే ఆ ఆనందం దేవతల వద్ద ఉంటుంది. ఆ ఆనందాన్ని వంద రెట్లు గుణిస్తే ఆ వచ్చే ఆనందం ఇంద్రుడి వద్ద ఉంటుంది. ఆ ఆనందాన్ని వంద రెట్లు గుణిస్తే ఆ వచ్చే ఆనందం బృహస్పతి వద్ద ఉంటుంది. ఆ ఆనందాన్ని వందరెట్లు గుణిస్తే వచ్చే ఆనందమే బ్రహ్మానందము. ఇంతకుమించి కొలత పెట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మానందము అంటే పరిపూర్ణ ఆనందం. అఖండమైన ఆనందం. ఈ ఆనందాన్ని అతను పొందుతున్నాడు. ఈ ఆనందాన్ని పొందే స్థితి కి చేరుకోవాలంటే, గురువు యొక్క ఉపదేశం వలన సాధ్యమవుతుంది. ఆ గురువు కూడా వేద అభ్యాసన చేసి బ్రహ్మనిష్టుడై ఉండాలి. అటువంటి గురువు వలన మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఆత్మస్వరూపం స్థితి ఎలా ఉంటుంది? అంతటా వ్యాపించి ఉంటుందా? ఆత్మ స్వరూపం అంతటా వ్యాపించి ఉండటం కాదు ఉండేదే ఆత్మ స్వరూపమే. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత అంతటా చీకటి అలుముకుంటుంది. అప్పుడు ఆ చీకటిలో ఒక వ్యక్తి నాకు ఏమీ కనిపించడం లేదు అని అంటున్నాడు. అంటే ఆ ప్రదేశంలో అన్ని పదార్థాలు ప్రకాశాన్ని కోల్పోయాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం నాకు ఏమీ కనిపించడం లేదు అని అంటున్నాడు. అంటే అతను ప్రకాశిస్తున్నాడు అని అర్థం. అతనిలో ప్రకాశం ఉండటం వలన నాకు ఏమీ కనిపించడం లేదు అని అంటున్నాడు. అంటే అతనిలో ఆత్మ ప్రకాశం ఉంది. కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నారు. అంటే అతనే ఆత్మ స్వరూపం అయి ఉన్నాడు. ఆత్మ స్వరూపం అయి ఉండటం వలన నాకు కనిపిస్తుంది, నాకు కనిపించడం లేదు అని వ్యక్తపరుస్తున్నాడు. లోపల ఆత్మ స్వరూపమే, బయట ఆత్మ స్వరూపమే. లోపలకి బయటకి మధ్య మన శరీరం యొక్క చర్మం అడ్డుగా ఉండటం వల్లనే ఈ ద్వైత భావం ఏర్పడింది. ఈ చర్మాన్ని తొలగిస్తే అంటే జ్ఞానం ద్వారా ఈ దేహ భ్రాంతిని తొలగిస్తే, ఆ అద్వైత స్థితి, ఆ ఆత్మ స్వరూపస్థితి కలుగుతుంది. ఆత్మస్వరూపస్థితి కలిగిన వాడిలో జ్ఞానం కూడా పడిపోతుంది. మరి ఉండేది ఆత్మ స్వరూపమే అయితే జగత్తు జీవులు కనిపిస్తున్నాయి కదా! దేహాలు పకృతి అన్ని కనిపిస్తాయి కానీ ఇవన్నీ కల్పితాలే కల్పనలే. ఆత్మ స్వరూపం జగత్తుకి విలక్షణంగా ఉంటుంది. ఉదాహరణకు సముద్రంలో నీటి బుడగలు, నురుగు, అలలు ఉంటాయి. సముద్రం వీటన్నిటికీ విలక్షణంగా ఉంది కదా! కానీ గాలి యొక్క సంయోగం వలన నీటి బుడగలు ఏర్పడ్డాయి. నిజానికి నామరూపాలలో భేదం ఉండవచ్చుగానీ, యదార్థానికి నురుగైన,అలలైన, నీటి బుడగలు అయినా సముద్రపు నీరే. వాయు సంయోగం వలన నాటికి నామరూపాలు ఏర్పడ్డాయి. అదే విధముగా మాయా కల్పనల వలన ఈ జగత్తు ఏర్పడింది. నాటకంలో ఒక వ్యక్తి బిచ్చగాడు పాత్రను పోషించాడు. చాలా సజీవంగా నటించాడు. అతని నటనలో అందరూ మైమరచి అతనిని బిచ్చగాడి గానే భావించారు. ఆ నటన పూర్తవగానే, బిచ్చగాడు పాత్ర ధరించిన వ్యక్తి ఆ వేషం తొలగించి యధాస్థితిని ధరించాడు. నిజానికి ఆ వ్యక్తి బిచ్చగాడు కాదు. కేవలం పాత్రధారుడే. కేవలం నాటకమే. ఈ విధంగానే జగత్తు జీవులు అంతా నాటకమే. మరి కర్మలు, క్రియలు జరుగుతున్నాయి కదా! కర్మలు, క్రియలు చేసేది ఆత్మ స్వరూపమే. మనం ఏదైనా వినాలంటే బయట ఉన్న ఆకాశ తత్వం శబ్ద రూపంలో మన చెవిలో ఉన్న సూక్ష్మ ఆకాశ తత్వానికి ఆకర్షింపబడితే శ్రవణం జరుగుతుంది. పంచభూతాలలో ఉన్న వాయు, ఆకాశ, పృథ్వి, జల, అగ్నిలు సూక్ష్మ పంచభూతాలతో ఆకర్షింపబడి శబ్ద, రస, గంధ, స్పర్శ రూపాలు ప్రకటించబడుతున్నాయి. నిజానికి మనకు కర్తృత్వ ,భోక్తృత్వాలు లేపు. దానిని 'నేను' అనే వాడు ఆరోపించుకుంటున్నాడు. నేను అనే భావనను తొలగించి చూస్తే అంతా బ్రహ్మ మయమే. అంతా బ్రహ్మ స్వరూపమే. జగత్తు బ్రహ్మే, పురుషుడు బ్రహ్మే ,స్త్రీ బ్రహ్మే. అన్నం బ్రహ్మ, అన్నం తిన్న పురుషుడు బ్రహ్మ ,అతడు తిన్న అన్నం దాతువుగా మారుతుంది. ఈ ధాతువు కూడా బ్రహ్మే. పురుషుడు స్త్రీ తో సంయోగం అనే యజ్ఞం చేసి, ఆ దాతువును స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడం వలన, శిశువు కలుగుతున్నాడు. ఆ శిశువు కూడా బ్రహ్మే. జగత్తులో ఏది మనం తయారు చేయడం లేదు. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన వలన జీవునికి తన యదార్థ స్వరూపం తెలియడం లేదు. కాబట్టి జ్ఞానంతో నేను అనే మూలతలంపు తొలగించి చూసినట్లయితే, బ్రహ్మ స్వరూపం సాక్షాత్కరిస్తుంది. హోమం చేసినప్పుడు హోమానికి సమిదులు ఉంచి, దాని క్రింద కర్పూరం వెలిగిస్తారు. ఆ కర్పూరం నుండి వచ్చిన అగ్ని చేత సమిదులు మండి కాలిపోతాయి. అదేవిధంగా మనము శ్రవణ, మనన, నిదిబ్యాసన చేయడం వలన మన అంతరంగంలో జ్ఞానాగ్ని వెలిగి దేహేంద్రియ మనోబుద్ధులు అనే సమిదులు కాలిపోతాయి. అగ్నిలో బంగారపు ఉంగరం ఉంచినట్లయితే ఉంగరంలో ఉన్న రాగి కరిగిపోయి స్వచ్ఛమయిన బంగారం మిగిలి ప్రకాశిస్తుంది. అదేవిధంగా నేను అనే మూలతలంపు పడిపోతుంది. తర్వాత మిగిలేది బ్రహ్మమే. ఈ సాధన ద్వారా అందరూ బ్రహ్మస్వరూపాన్ని పొందాలని ఆశిస్తూ... సర్వేజనా సుఖినోభవంతు ●●●●