కర్మ సిద్ధాంతము

                         కర్మ సిద్ధాంతం  

                       +++++++++++++++++++


  1. ప్రకృతిలో ప్రతి జీవి కర్మలను చేస్తూ ఉంటాయి . సూర్యుడు ప్రకాశించడం అనే కర్మను చేస్తూ ఉంటాడు. గ్రహాలు పరిభ్రమించే కర్మను చేస్తూ ఉంటాయి. పశుపక్ష్యాదులు జంతువులు క్రిమికీటకాలు కర్మలు చేస్తూ ఉంటాయి. కర్మ అంటే పని చేయడం. మనుషులు నిత్య కర్మ లతోపాటు మరి కొన్ని కర్మలను చేస్తూ ఉంటాడు. వాటిలో పుణ్య కర్మలు ఉంటాయి, పాప కర్మలు ఉంటాయి. ఈ కర్మలన్నీ దేనికోసం చేస్తాడంటే తన సుఖం కోసం తన సంతోషం కోసం తన కుటుంబం కోసం చేస్తూ ఉంటాడు. మామూలుగా అన్ని జన్మల కంటే ఉత్తమమైనది మానవ జన్మ. మానవ జన్మ చాలా గొప్పది, చాలా దుర్లభమైనది. అందుకే ఆది శంకరాచార్యులవారు "జంతునామ్ నరజన్మ దుర్లభం" అని అన్నారు. ఎందుకంటే ప్రకృతిలో 84 లక్షల రకాల జీవరాశులులో 83 లక్షల 99 వేల 9వందల 99 జీవరాసులకు మోక్షాన్ని పొందే అధికారం లేదు. ఒక్క మానవజన్మకు మాత్రమే మోక్షాన్ని పొందే అధికారం ఉంది. చివరికి దేవతలు కూడా మోక్షాన్ని పొందే అధికారం లేదు. మనిషి ఇంత గొప్ప అధికారాన్ని కలిగి ఉండి, తన జన్మను వృధా చేసుకుంటున్నాడు. మోక్షం అంటే భగవంతుని పొందడం జీవుడు పరమాత్మ స్వరూపాన్ని పొందటం దీనినే మోక్షం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు ఉపనిషత్తులు వేదాలు ఇదే విషయాన్ని వివరిస్తున్నాయి. "శరీరమాద్యం కలు మోక్ష సాధనం" ఈ విషయాన్ని మనిషి గ్రహించలేక పోతున్నాడు. అందువలన మానవుడు కర్మ బంధం లో ఇరుక్కుని జన్మ చక్రం లో పడి సంసార సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు. కర్మలు మూడు రకాలు మొదటిది ఆగామి కర్మ రెండవది సంచిత కర్మ మూడవది ప్రారబ్ద కర్మ ఈ 3 కర్మల వల్ల మనిషి జన్మ ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి జన్మనే కాదు ఏ జన్మకైనా అనగా పశుపక్ష్యాదులు జంతువులు మృగాలు క్రిమికీటకాలు ఏ జన్మ అయినా ఈ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. జీవుడు తండ్రి యొక్క ధాతువు నుండి తల్లి గర్భంలో చేరి శరీరాన్ని ధరించి భూమి మీదకి వస్తాడు. పుట్టిన నుండి మరణించేవరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. అవి పుణ్య కర్మలు కావచ్చు లేదా పాపకర్మల కావచ్చు ఇలా చేసిన కర్మలను ఆగామి కర్మలు అంటారు. ఈ ఆగామి కర్మలు కొన్ని అప్పటికప్పుడు పక్వానికి వచ్చి ఫలితాన్నిస్తాయి. మరికొన్ని వెంటనే పక్వానికి రావు ఇలా పక్వానికి రాని కర్మలను జీవుడు తన దేహాన్ని విడిచిన తర్వాత ఈ కర్మలు అన్నిటిని తనతో పాటు తీసుకు వెడతాడు. ఈ కర్మలను 'సంచిత కర్మలు' అంటారు. ఈ 'సంచిత కర్మలు' చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి. జీవుడు ఈ సంచిత కర్మల మూటను తనతో పాటు పిత్రు లోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో వాటిని అక్కడ అనుభవిస్తాడు. అంటే పుణ్య కర్మలు పక్వానికి వచ్చినట్లయితే, సుఖ భోగాలను అనుభవిస్తాడు. పాపకర్మలు గాని పక్వానికి వచ్చినట్లయితే నరకయాతన అనుభవిస్తాడు. సంచిత కర్మలు పక్వానికి వచ్చి వాసనలు కూడా పక్వానికి వచ్చిన ట్లయితే తల్లి గర్భాన్ని ఆశ్రయించి దేహాన్ని ధరిస్తాడు. దేహాన్ని ధరించడం అంటే ఒక మనిషి దేహాన్ని కాదు, జంతువులు పక్షులు పశువులు మృగాలు ఏ దేహాన్ని అయినా ధరించవచ్చు. వాసనలు అంటే కామ క్రోధ మద మాత్సర్యాలు వీటిలో ఏదైతే అనగా ఏ వాసన అయితే బలంగా ఉంటుందో ఆ వాసనతో పాటు పక్వానికి వచ్చిన సంచిత కర్మలతో ఫలాలను అనుభవించడానికి తగిన దేహాన్ని పొందుతాడు. ఇలా దేహాన్ని ధరించి ఏ సంచిత కర్మలు అయితే పక్వానికి వస్తాయో, వాటిన అనుభవించడాన్నీ 'ప్రారబ్దం' అంటారు. ఇదే ప్రక్రియ జన్మ జన్మలుగా కొన సాగుతూనే ఉంటుంది. ఇలా జన్మ జన్మలుగా ప్రోగు చేసుకున్నా కర్మలతో అనగా సంచిత కర్మల తో జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఉదాహరణకు ఒక తండ్రి ఇద్దరు కూతుర్లును కలిగి ఉన్నాడు. కానీ ఆ తండ్రి పేదవాడు కావడంవల్ల కూతుర్లకు వివాహం చేయలేకపోతున్నాడు. కూతుర్లకు వివాహం చేయమని భార్య పోరు పెడుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా తన ఆర్థిక పరిస్థితి వల్ల కూతుర్లకు వివాహం చేయలేకపోతున్నాడు. చాలా బాధపడుతున్నాడు. ఏమి చేయలేని పరిస్థితి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఇలా రోజులు గడుస్తుండగా, ఒక నాడు ఆకస్మికంగా తన దూరపు బంధువుకి వారసులు ఎవరూ లేకపోవడం వలన అతని ఆస్తి అంతా తనకు చేరింది. ఆ తండ్రి చాలా సంతోషాన్ని పొందేడు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు . ఈ కలిసి వచ్చిన ఆస్తి తో తన ఇద్దరు కూతుళ్లకు వివాహం జరిపించాడు. అంటే అతను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో అతని యొక్క సంచిత కర్మ లో పుణ్య కర్మ పక్వానికి వచ్చి ప్రారబ్ధం గా మారింది. ఇప్పుడు ఆ కర్మను అనగా ఈ ప్రారబ్ద కర్మను ఖచ్చితంగా అనుభవించి తీరాలి. దాని మూలంగా అప్పటివరకు అనుభవిస్తున్న  దుఃఖం పక్కకు తొలగిపోయింది. ఇక మిగిలిన దుఃఖం అనగా అనుభవించవలసిన మిగిలిన దుఃఖం సంచితంగా మారింది. ఇప్పుడు కలిసివచ్చిన ఆస్తితో ఏ పుణ్యకర్మలు చేసిన ఏ పాపకార్యములు చేసిన అది ఆగామి కర్మ అవుతుంది. ఈ ఆగామి కర్మలు పక్వానికి వచ్చినవి అనుభవించిన తర్వాత పక్వానికి రాని ఆగామికర్మలు సంచిత కర్మలుగా మారుతాయి. ఇదియే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ఒక ప్రశ్న మనిషి చేసినకర్మలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? మనిషి చేసిన కర్మలు అన్ని అనగా సంచిత కర్మలు చిత్రముగా గుప్తముగా దాచబడి వుంటాయి. అందుకే గరుడపురాణంలో వేదవ్యాసుడు చిత్రగుప్తుడు అని పేరు పెట్టాడు. మనిషి చేసిన పాపపుణ్యాలను ఎవరు చూస్తారు అని ఒక ప్రశ్న. భగవంతుడు మనిషి చేసే పాపపుణ్యాలకు సాక్షిగా 16 రహస్య నేత్రాలను  అమరిచ్చాడు. అవి 5 పంచభూతాలు, 4 వేదాలు, సూర్యుడు, చంద్రుడు సూర్యోదయం, సూర్యాస్తమయం పగలు రాత్రి మరియు ఆత్మ. ఈ 16 మనిషి చేసే పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాయి. మనిషి పంచభూతాలు నుండి వేదాల నుండి సూర్య చంద్రుల నుండి అన్నింటి నుండి తప్పించుకున్నప్పటికి, తన ఆత్మ నుండి తప్పించుకోవడం అసంభవం. ఇప్పుడు మనిషి కేవలం పుణ్యకర్మల మాత్రమే చేసినట్లయితే అనగా ఇతరులకు సాయం చేస్తూ ఎవరిని బాధపెట్టకుండా దానధర్మాలు చేస్తూ భగవంతుని యందు భక్తిని కలిగి ఉండి కేవలం పుణ్య కార్యాలను చేసి దేహాన్ని విడిచిపెట్టి నట్లయితే, ఆ జీవుడు దేవలోకానికి వెళ్లి సుఖ భోగాలను అనుభవిస్తాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. అది ఏమిటంటే దేవతలకు మనసు బుద్ధి ఉంటుంది గానీ దేహము ఉండదు. దేహం లేని కారణంగా కర్మలు చేసే అధికారం కూడా ఉండదు. ఈ కర్మలు చేసే అధికారం లేకపోవడం వలన మోక్షాన్ని అందుకునే అధికారం కూడా లేదు. కేవలం సుఖ భోగాలను అనుభవించడం మాత్రమే. ఈ సుఖభోగాలను అనుభవించిన తర్వాత మరలా వాసన, కర్మలు పక్వానికి వచ్చి మరలా భూలోకానికి చేరి తల్లి గర్భన్ని ఆశ్రయిస్తాడు. మనిషి కేవలం పాపకర్ములను చేసి అనగా ఇతరులను బాధపెట్టే అక్రమంగా డబ్బు సంపాదించి దేవుని యందు భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవింస్తూ  కేవలం పాపకర్మలు చేస్తూ దేహాన్ని విడిచి పెట్టినట్లయితే, ఆ జీవుడు నరక లోకానికి చేరి నరకయాతన అనుభవిస్తాడు. ఆ తర్వాత వాసనలు, కర్మలు పక్వానికి వచ్చినట్లయితే మరలా భూలోకానికి చేరి దేహాన్ని ధరిస్తాడు. అనగా ఏ పాపకర్మల అయితే అనుభవించాలో దానికి తగిన దేహాన్ని పొందుతాడు. ఆ దేహం పశువులు కావచ్చు జంతువులు కావచ్చు అంటే పిల్లి, నక్క, కుక్క ఇలాంటి జన్మలు పొందుతాడు. ఈ జంతువుల దేహం తో ప్రారబ్ధం అనుభవిస్తాడు. ఇప్పుడు మనిషి సగం పుణ్యకార్యాలు సగం పాపకార్యాలు చేసి దేహాన్ని విడిచిపెట్టి నట్లయితే, సంచిత కర్మలు నుండి ఏకర్మమైతే పక్వానికి వస్తాయో ఆ కర్మలను అనగా సుఖభోగాలను మరియు నరకయాతనలు అనుభవించి మరలా వాసనలు, కర్మలు పక్వానికి వచ్చినట్లైతే తల్లి గర్భాన్ని ఆశ్రయించి మిశ్రమ కర్మ ఫలితం కారణంగా మనిషి దేహాన్ని ధరిస్తాడు. మనిషి పుణ్యకార్యములు చేసినట్లయితే బంగారు సంకెళ్ళు, పాపకర్మలు చేసినట్లయితే ఇనుప సంకెళ్లు . ఏదైనా సంకెళ్లు సంకెళ్లే. బంగారపు సంకెళ్ళు అయితే చూసుకొని ఆనందించడానికి బాగుంటుంది కానీ జన్మలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా పుణ్యకార్యం చేసినా పాపకార్యం చేసిన జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. 'భజగోవిందం'లో ఆది శంకరాచార్యులవారు చెప్పినట్టు "పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిః మురారే" మళ్లీ మళ్లీ పుట్టడం, మళ్లీ మళ్లీ చావడం, మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు’’ఆని అర్థం. మన వాసనలు, కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించి, జన్మ పొందుతాము. ఆ జన్మలో కొన్ని వాసనలు, కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము. మళ్లీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను, వాసనలను ప్రోగు చేసుకుంటాము. మళ్లీ ఈ వాసనలు, కర్మఫలాల మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తుంటాం. ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్లీ మళ్లీ ఎత్తుతూ ఉంటాం. ఈ జనన, మరణ చక్రంలో బంధింపబడతాం. ఈ వాసనలు, కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన, మరణాలు తప్పవు మరియు ఈ జన్మ చట్రంలో ఇరుక్కు పోవాలి. సంసారబంధ జన్మచక్రం నుండి బయట పడాలి అంటే ఏం చేయాలి అన్నది ప్రశ్న.ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. అయితే మానవుడు ఏ పనీ చేయకుండా ఉండడానికి బండరాయి కాదు. కనుక పని చేయాల్సిందే. ‘కుర్వన్నే వేహ కర్మాణి’ అని ఈశావాస్యోపనిషత్‌లో చెప్పినట్లు ‘ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే’. ‘నహికశ్చచ్‌ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృత్‌’ అని భగవద్గీతలో బోధించినట్లు ‘కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండే వీలు లేదు’.ఆగామి కర్మలు అయితే జాగ్రత్తగా చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలి? కోరికలు లేకుండా... నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా అనగా కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవదర్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావమూ లేకుండా నిత్యా,నైనిత్య చేసినట్లయితే, అనగా కర్మయోగము ద్వారా కర్మలు చేసినట్లయితే ఈ ఆగామి కర్మలు అనుభవించ వలసిన పని ఉండదు. అది సంచిత కర్మ గా మారకుండా చూసుకోవచ్చు. ఈ ఆగామి కర్మలని నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు కొత్త వాసనలు దరి చేరవు. కర్మఫలాలు కూడా అంటవు. అయితే ఇలా చెయ్యాలంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మన స్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంత కాలం ఈ పుట్టడం, చావడం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే .మరి ప్రారబ్దం మాటేమిటి? ప్రారబ్ధం మాత్రం తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ప్రారబ్ద కర్మలను ఈశ్వరుని యందు భక్తితో, ఈశ్వరుడే నాతల్లి తండ్రి ఆయనే నన్ను రక్షిస్తాడు అన్న నమ్మకంతో, ఈ ప్రారబ్ధం అనుభవిస్తూ ఆగామి కర్మలను జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు సంచిత కర్మల మాటేమిటి అన్నది ప్రశ్న. సంచిత కర్మలు ఎప్పటికప్పుడు అనుభవించడానికి కుదరదు సంచిత కర్మలు పక్వానికి వస్తే గాని మనిషి అనుభవించడానికి వీలవుతుంది మరి ఎలా? దానికి ఒక మార్గం ఉంది ఈ సంచిత కర్మలను ఒకేసారి దగ్ధం చేయాలి. దగ్ధం చేయాలి అంటే అగ్నిలో వేసి కాల్చడం కాదు ఒక విధంగా అగ్నిలో వేసి దగ్ధం చేయాలి ఆ అగ్ని ఏమిటంటే 'జ్ఞానాగ్ని'. ఈ సంచిత కర్మలు జ్ఞానమనే అగ్ని తో దగ్ధం చేయాలి. ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు. "దేయథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేర్జున | జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథాజ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథాహము". మరి జ్ఞానం అంటే ఏమిటి? మనోబుద్దులు,ప్రాణము మరియు ఇంద్రియాలు ఇవేమి నేను కాదు నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం కలగడమే జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలగాలి అంటే గురువు అనుగ్రహం కలగాలి. గురువును ఆశ్రయించి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత మొదలైన గ్రంథాల ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మ విచారణ చేయాలి. ఆది శంకరాచార్యులవారు రచించిన గ్రంథాలలో 'ఆత్మ బోధ' అనే ప్రకరణ గ్రంధం చదివినట్లయితే ఆత్మ విచారణ ఎలా చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు కూడా వివరిస్తున్నాయి ఈ విధంగా ఆత్మ విచారణ చేసి జ్ఞానాన్ని సంపాదించి సంచిత కర్మ లను ఒక్కసారిగా దగ్ధం చేయవచ్చు ఈ ప్రక్రియ అంతా ఒక రాత్రిలో ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. దీనికి ఎంతో సాధన అవసరం అవుతుంది. జీవుడు ఈసాధన ఈ జన్మలో మొదలుపెడితే కొన్ని జన్మల వరకు కొనసాగించి మోక్షాన్ని చేరుకుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని వివరిస్తాడు. ఈ జన్మలో సాధన మొదలు పెట్టు ఈ మొదలుపెట్టిన సాధన జన్మజన్మలకు కొనసాగి మోక్షాన్ని చేరుతారు. ఏ జన్మలో అయితే సాధన మొదలు పెట్టి దేహాన్ని విడిచి పెడతాడో, తర్వాత జన్మలో మరలా ఉత్తమ మానవ జన్మ ఎత్తి క్రితం జన్మలో దేహాన్ని విడిచి పెట్టినంత వరకు కొనసాగిన ఈ సాధన తర్వాత జన్మలో కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రాత్రి సమయాన వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు దారి మార్గంలో ఏదో సమస్య వచ్చి వాహనం ఆగినట్లుయితే ఆ వ్యక్తి సూర్యోదయం అయ్యే అంతవరకు అక్కడే గడిపి ఉదయాన ఆ కారు సమస్యను పరిష్కరించి మరలా అక్కడ నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గాని, మొట్టమొదటగా మొదలుపెట్టిన ప్రదేశం నుండి ప్రయాణించడు కదా! అదేవిధంగా జీవుడు ఏ జన్మలో అయితే తన సాధన మొదలుపెట్టి తన దేహాన్ని విడిచిపెడ తాడో, తదుపరి జన్మలో మరలా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి తన సాధనను పునః ప్రారంభిస్తాడు.ఎన్ని యుగాలు గడిచినా ఈ కర్మసిద్దాంతం లో సవరణలు జరగదు. ఎందుకంటే ఇది భగవంతుని ద్వారా నిర్మితమైన సిద్దాంతం. కుబేరుడుకి అయిన పేద వాడికైనా ఇదే సిద్దాంతం.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు