ఆత్మ ఆనంద స్వరూపం అయితే దుఃఖం ఎందుకు కలుగుతుంది?

ఆత్మ ఆనంద స్వరూపం అయితే దుఃఖం ఎందుకు కలుగుతుంది?
*********************************************
ఆత్మ ఎప్పటికి ఆనంద స్వరూపమే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆత్మకి దుఃఖం అంటే ఏమిటో తెలియదు. మన ఉపనిషత్తులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాయి. ఆత్మ నిత్యం ఆనందంగా ఉంటే మనిషికి దుఃఖం, బాధ ఎలా కలుగుతున్నాయి అన్నదే ప్రశ్న. మనిషికి దేహం వలన బాధ, మనసు వలన దుఃఖం కలుగుతున్నాయి. మనసు సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఉదాహరణకు
ఒక తండ్రికి కొడుకు ఉన్నాడు. అతనికి ఉద్యోగం రావడం లేదు. తండ్రి కొడుకుకి ఉద్యోగం రావడం లేదని బాధలో ఉన్నాడు. అందరూ మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా అని అడుగుతున్నారు. అందరికి ఉద్యోగం వస్తుంది కొడుకుకి ఉద్యోగం రావడం లేదు. కొడుకు  ఎప్పుడు జీవితంలో స్థిరపడతాడు అని వేదన ఉంది మనసు ఆందోళన చెందుతుంది దిగులు చెందుతుంది. కొడుకు ఉద్యోగం  కోసం చేయని ప్రయత్నం లేదు. ఇంట్లో భార్య కొడుకు గురించి పోరు పెడుతుంది. ఏమి చేయాలో తెలియడం లేదు. మనసు అంతా దుఃఖంతో నిండిపోయింది. దుఃఖంతో కాలం గడిచిపోతుంది. కొంత కాలానికి కొడుకు తండ్రి వద్దకు వచ్చి నాన్న గారు నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. అంతే తండ్రికి మనసులో ఉన్న భారమంతా దిగిపోయింది. మనసు ప్రశాంతత చెందింది. ఆనందం కలిగింది. ఇక్కడ ఏమి జరిగింది అంటే మనసు దుఃఖంతో ఉన్నపుడు మనసు ఆత్మని కప్పేసింది. అందువలన ఆత్మ యొక్క ఆనందం తెలియబడలేదు. ఎప్పుడయితే మనసుకు దుఃఖం తోలిగి పోయిందో అప్పుడు మనసు తేలిక పడి ఆత్మకి అడ్డం తిరిగిపోయింది అంటే అడ్డం తొలిగిపోయింది. ఇప్పుడు ఏమయింది? ఆత్మ యొక్క ఆనందం బహిర్గతం అయింది. తన యొక్క ఆనందం అనుభూతిలోకి వచ్చింది. ఇందు మూలంగా మనకు తెలియబడింది ఏమిటంటే ఆత్మ ఆనంద స్వరూపమే.